Begin typing your search above and press return to search.

కోమ‌ట్లు అంటూనే ఐల‌య్య నోట మాట‌ల మంట‌లు

By:  Tupaki Desk   |   18 Sep 2017 6:32 AM GMT
కోమ‌ట్లు అంటూనే ఐల‌య్య నోట మాట‌ల మంట‌లు
X
కాలం మారింది. మ‌నుషులు మారారు. గ‌తంలో మాదిరి ప‌రిస్థితి ఇప్పుడు లేదు. ఎవ‌రిని ఎవ‌రేం అన్నా చాలా ఎక్కువ‌గా ప‌ట్టించుకుంటున్నారు. మాట అనేసినోడు వాడి పాపాన వాడు పోతాడ‌ని అస్స‌లు అనుకోవ‌టం లేదు. ఒక కులాన్ని కానీ మ‌తాన్ని కానీ కించ‌ప‌రిచే మాట‌లు అనే సాహ‌సం ఇప్పుడు ఎవ‌రూ చేయ‌టం లేదు. ఒక‌వేళ అనుకోని రీతిలో చేసినా.. త‌న మాట‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మైతే వెంట‌నే వెన‌క్కి త‌గ్గ‌టం క‌నిపిస్తుంది.

కానీ.. ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య తీరు మాత్రం ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. కోమ‌టోళ్లు సామాజిక స్మ‌గ్ల‌ర్లు అంటూ వివాదాస్ప‌ద రాత‌లు రాసిన పుస్త‌కం పెను దుమారాన్నే రేపింది. ఆర్య‌వైశ్యుల‌పై వ్య‌క్తిగ‌తంగా.. వృత్తి ప‌రంగా ప‌లు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసిన ఈ పుస్త‌కంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఐల‌య్య వెన‌క్కి త‌గ్గ‌టం లేదు. త‌న‌ను త‌ప్పు ప‌డుతున్న ఆర్య‌వైశ్యుల‌కు మ‌రింత మంట పుట్టేలా.. ఆవేశంతో ర‌గిలిపోయేలా.. ఆగ్ర‌హంతో ఉడికిపోయేలా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

త‌న మాట‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆయ‌న ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా మ‌రింత మంట పుట్టేలా తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. టీ మాస్ ఫోరం వ‌రంగ‌ల్ ఆర్బ‌న్ జిల్లా ఆవిర్భావ స‌భ‌కు హాజ‌రైన ఐల‌య్య‌.. వైశ్యుల‌పై మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

తాను ఉద్యోగం వ‌దిలిపెట్టి టీమాస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జాస‌మస్య‌ల‌పై పోరాడ‌తాన‌న్నారు ఐల‌య్య‌. ఊరూరా కోమ‌టోళ్లు నుంచి ఈ రోజు హైద‌రాబాద్‌లో ఉన్న పెద్ద ఎయిర్ పోర్టు.. అంద‌రూ వాడే రిల‌య‌న్స్ ఫోన్‌.. ఎయిర్ టెల్ ఫోను.. ఇక్క‌డుండే రిల‌య‌న్స్ షాపుల వాళ్ల దాకా.. అంబానీ.. ఆదానీ.. కిర్లోస్క‌ర్‌.. గోయెంకా.. వీళ్లంతా ఆర్య‌వైశ్య కోమ‌టోళ్లేన‌న్నారు. మోడీని సైతం కోమ‌టోడే అన్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. వీళ్ల నాయ‌కుడు ఇప్పుడు దేశాన్ని పాలించే న‌రేంద్ర మోడీ బీసీ కోమ‌టాయ‌న అన్న ఐల‌య్య‌.. కోమ‌ట్ల‌లో బీసీలు ఉన్నార‌ని.. బీజేపీ పార్టీ అధినేత అమిత్ షా ఆర్య‌వైశ్య కోమ‌టాయ‌న అని అన్నారు.

దేశంలో ఉన్న 93 శాతం కులాల‌కు సంప‌ద‌లో వాటా ద‌క్క‌కుండా కోమ‌టోళ్లు దోపిడీ చేస్తున్నార‌న్నారు. ఆర్య‌వైశ్యులంతా టీఆర్ఎస్‌కు.. బీజేపీకి వ‌చ్చే డొనేష‌న్ల‌లో ఐదుశాతం ఇస్తే.. తెలంగాణ‌లో ఒక్క రైతు ఆత్మ‌హ‌త్య చేసుకోక‌కుండా టీమాస్ చూస్తుంద‌న్నారు. దండె కొట్టే కోమ‌టోళ్లు.. సోల‌కొట్టే కోమ‌టోళ్లు అన్నందుకు వారిప్పుడు ఉలిక్కిప‌డుతున్నార‌ని.. రోడెక్కి కోమ‌టి ఆడోళ్లు కూడా నిర‌స‌న చేస్తున్నార‌ని.. దీంతో వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న బంగారం ఆభ‌ర‌ణాలు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నాయ‌న్నారు. త‌న‌ను చంపితే ఆర్య‌వైశ్యులే బాధ్యుల‌న్న ఐల‌య్య‌.. కోమ‌టోళ్లు పెద్ద ఎత్తున డొనేష‌న్లు ఇచ్చి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను త‌మ గుప్పెట్లో ఉంచుకుంటార‌న్నారు.

మోడీ లాంటి బీసీ కోమ‌టోళ్లు.. అమిత్ షా లాంటి ఆర్య‌వైశ్య కోమ‌టోళ్ల చేతుల్లోనే 46 శాతం సంప‌ద పోగుప‌డింద‌న్న ఐల‌య్య‌.. వ‌డ్డీ వ్యాపారంతో మాన‌వ‌త్వం లేకుండా అప్పు చేసిన అయ్య చ‌చ్చినా రెండింత‌లు చేసి కొడుకును హింస పెడ‌తార‌న్నారు. యుద్ధం చేసే సైనికులంతా ఎస్సీ.. ఎస్టీ.. బీసీల‌ని.. కోమ‌టోళ్లు కాద‌న్నారు.

బీర‌కాయ‌.. బెండ‌కాయ తింటే యుద్ధం చేయ‌గ‌ల‌రా? అందుకే గొడ్డు మాంసం.. పంది మాంసం తింటామ‌న్నారు. అది త‌ప్పెట్లా అవుతుంద‌న్న ఐల‌య్య‌.. యుద్ధంలో గెల‌వాలంటే ఆ మాత్రం తినాల్సిందేన‌న్నారు. దేశ ర‌క్ష‌ణ కోసం పాటుప‌డే సైన్యంలో ఒక్క కోమ‌టాయ‌న ఉన్నాడా? అంటే లేర‌ని ఆర్య‌వైశ్యులే చెబుతున్నార‌న్నారు. ల‌క్ష‌ల కోట్ల ఆస్తులు కూడ‌బెట్టిన కోమ‌టోళ్లు సైనికుల కుటుంబాల‌కు వారి ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాలు ఇవ్వాల‌న్నారు. రైతులు పురుగ‌న్నం నుంచి త‌ప్పించేందుకు.. సైనికుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు తాను మాట్లాడుతున్నాన‌ని త‌న వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్థించుకున్నారు.

కోమ‌టోళ్లు రోడ్డు మీద‌కు వ‌స్తున్నార‌ని.. త‌న ఫోటోల‌కు చెప్పుల‌తో కొడుతున్నార‌ని.. చెప్పుల దండ‌లు వేస్తున్నార‌ని.. త‌న‌కు చెప్పులంటే ప్రేమ‌ని.. తాను ఆ దండతోనే రోడ్డు మీద‌కు వ‌స్తాన‌న్నారు. ఈ మ‌ధ్య‌న ఒక పిల్ల‌గాడు చ‌నిపోతే కోమ‌టోళ్లు ఇంట్లోకి రానివ్వ‌లేద‌ని.. రాత్రంతా వ‌ర్షంలోనే త‌డుచుకుంటూ ఉన్నార‌ని.. సీఎం కేసీఆర్ కానీ ఆ త‌ల్లికి ప‌రిహారం ఇప్పించ‌కుంటే పోరాటం త‌ప్ప‌ద‌న్నారు.

దేశంలో ఒక మాదిగోడో.. మాలోడో.. చాక‌లోడో.. మంగ‌లోడో.. అంబేడ్క‌ర్ త‌ర్వాత ఎవ‌రూ పుట్ట‌డ‌నుకున్నార‌ని.. కానీ కంచ ఐల‌య్య పుట్టిండ‌న్నారు. తాను ఎర్ర‌జెండా క‌ప్పుకొని దేశ‌మంత తిరుతాన‌న్నారు. పేద‌ల‌కు అండ‌గా ఉద్య‌మాలు చేస్తాన‌ని.. రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల ఉద్యోగాలు పొందిన ఉద్యోగ‌స్తులంతా తాను నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు పెద్ద సంఖ్య‌లో రావాల‌ని.. లేదంటే వారిని కూడా తిట్టాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఐల‌య్య తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో త‌న మాట‌ల‌తో మరింత అగ్గి పుట్టించేలా ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.