Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో `క‌మ్మ`ల‌కు అధిక ప్రాధాన్యం

By:  Tupaki Desk   |   16 Jun 2016 9:25 AM GMT
టీఆర్ ఎస్‌ లో `క‌మ్మ`ల‌కు అధిక ప్రాధాన్యం
X
ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో సామాజిక‌వర్గాల‌కు అధిక‌ ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇత‌ర సామాజిక వ‌ర్గాల్లోని బ‌ల‌మైన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా .. పార్టీ బ‌లం రెట్టింపు అవుతుంద‌న్న భావ‌న నాయ‌కుల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో రెడ్డి - క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అధికారాన్ని చేప‌డుతూ వ‌చ్చారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌.. ముఖ్యంగా తెలంగాణ‌లో వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన కేసీఆర్.. సీఎం అవ‌డంతో రెడ్డి సామాజిక వ‌ర్గ నేతల ఆధిప‌త్యానికి గండిప‌డింది.

ఇప్పుడు టీఆర్ ఎస్‌ ను గ‌మ‌నిస్తే.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లకు ఆ పార్టీలో రోజు రోజుకు ప్రాధాన్యం పెరుగుతూ వ‌స్తోంది. బ‌ల‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను వ్యూహాత్మ‌కంగా పార్టీలో చేర్చుకోవ‌డంతో.. టీఆర్ ఎస్‌ లో వీరి ప్రాబ‌ల్యం క్ర‌మంగా పెరుగుతోంది. వీరికి కూడా కేసీఆర్‌ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజ‌కీయాల్లో రాణించాలంటే బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ అండ చాలా ముఖ్యం! ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లున్న నాయ‌కుడికైనా ఇప్పుడు ఏదో ఒక కులం అండ త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ జ‌రుగుతోంది. అన్ని సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు.. క్ర‌మంగా గులాబీ గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గ‌నేత‌ల‌ను వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ పార్టీలో చేర్చుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ - ఖమ్మం - నిజామాబాద్ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎంతో కొంత ఉందని భావించిన కేసీఆర్... మొదట ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ ఎస్ లో చేర్చుకుని మంత్రి పదవి అప్పగించారు.

ఆ తరువాత గ్రేటర్ పరిధిలో టీడీపీ తరపున విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ - అరికెపూడి గాంధీకి గులాబీ కండువా కప్పేశారు కేసీఆర్! తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ ను టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు. తాజాగా మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావును కూడా టీఆర్ ఎస్‌ లో చేర్చుకున్నారు. వీరంద‌రికి కంటే ముందుగానే ఆదిలాబాద్ సిర్పూర్ కాగ‌జ్‌ న‌గ‌ర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప టీఆర్ ఎస్‌ లో చేరారు. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన మ‌రో మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును కూడా పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ తుమ్మ‌ల ద్వారా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. టోట‌ల్‌ గా ఇప్పుడు గులాబీ వ‌నం క‌మ్మ‌గా పూస్తోంద‌న్న టాక్ తెలంగాణ రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తోంది.