Begin typing your search above and press return to search.

టీడీపీ విష‌యంలో క‌మ్మ వ‌ర్గం సైలెంట్‌.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   28 Jan 2022 1:30 AM GMT
టీడీపీ విష‌యంలో క‌మ్మ వ‌ర్గం సైలెంట్‌.. రీజ‌నేంటి?
X
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీకి కీల‌క‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం సైలెంట్‌గా ఉంది. ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది? అనే మాట జోరుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చేసిన శ‌ప‌థం మేరకు పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు అన్ని వ‌ర్గాలుక‌లిసి ప‌నిచేయాల‌ని.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఇత‌ర వ‌ర్గాల మాటేమో కానీ.. క‌మ్మ వ‌ర్గంలో మాత్రం ఆశించిన ఊపు క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఏంట‌నేది పార్టీలోనే చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఈ వ‌ర్గం సైలెంట్ అవ‌డానికి చంద్ర‌బాబు తాజాగా చేసిన అంత‌ర్గ‌త ప్ర‌క‌టేన‌ని అంటున్నారు పార్టీ నేత‌లు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరిగిన తప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా చూసుకోవడంతో పాటు ప్రధాన విమర్శ గా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సీట్లు తగ్గించాలని బాబు భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంటే, ఇప్పటివరకు పార్టీలో తమకు తిరుగులేదని భావిస్తూ వచ్చిన కమ్మ సామాజిక వర్గం నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంద‌ని చ‌ర్చ సాగుతోంది.

వాస్త‌వానికి ఈ ప్ర‌క‌ట‌న‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. పార్టీలో ఎవరు యాక్టివ్ గా పని చేస్తున్నారు? అనే విషయం కన్నా కమ్మ సామాజిక వర్గం అయితే చాలు అనే మాట వినిపించేది. వారికే అన్ని ప‌ద‌వులు ఇస్తున్నార‌ని.. గ‌తంలోనూ టీడీపీలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. ఈ సామాజిక వ‌ర్గంలోనే ప్ర‌స్తుత ఎమ్మెల్యే గోరంట బుచ్చ‌య్య చౌద‌రివంటి వారు.. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించారు. మ‌రో వైపు ఆ వర్గం నేతలు ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో యాక్టివ్ గా పని చేయని పరిస్థితి పార్టీలో నెలకొందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్నికల ముందు మాత్రం టికెట్ల కోసం రావడం, త‌మ‌ పని చేసుకోవడం పూర్తి చేస్తున్నార‌ని ఈ వ‌ర్గంపై విమ‌ర్శ‌లు వున్నాయి. దీంతో మిగిలిన సామాజిక వర్గాల్లో ఎంతమంది పార్టీ నాయకులు ఉన్నా.. టికెట్లు విష‌యం మాత్రం పార్టీలో తరచుగా వివాదంగా మారుతోంది. ఈసారి చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి కొంత ప్రాధాన్యం తగ్గించాలని ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, అసలు చిక్కు ఇప్పుడే వచ్చింది. అదేంటంటే కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు తగ్గించాలి అని భావిస్తే మొదట చంద్రబాబు కుటుంబంలోని టికెట్లు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎందుకంటే చంద్రబాబు కుటుంబంలోనే నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారు. ఒకటి చంద్రబాబు, రెండు లోకేష్ 3 చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ. అంటే ఒక కుటుంబం నుంచి ముగ్గురికి గత ఎన్నికల్లోనే టిక్కెట్లు ఇచ్చారు. అయితే, చంద్రబాబు, బాలకృష్ణ గెలిచినా.. లోకేష్ మాత్రం ఓడిపోయారు. ఇప్పుడు టికెట్లు తగ్గించాలి అని భావిస్తే కమ్మ సామాజిక వర్గంలో మొట్టమొదట తెర మీదకు వచ్చే ప్రశ్న బాబు కుటుంబంలో ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు ఉన్నది. కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు తగ్గించాలి అని కనుక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు మొదట తన కుటుంబం నుంచే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి. మ‌రి ఆయ‌న‌ ఏం చేస్తారు అనేది ఆసక్తిగా ఉంది. అందుకే ఈ వ‌ర్గం.. ఈ విష‌యం తెలిసినప్ప‌టి నుంచి సైలెంట్ అయింద‌ని అంటున్నారు.