Begin typing your search above and press return to search.

సుజనా మాదిరే పవర్ పట్టినట్లుందే కామినేని?

By:  Tupaki Desk   |   27 Jan 2017 9:58 AM GMT
సుజనా మాదిరే పవర్ పట్టినట్లుందే కామినేని?
X
చూసేందుకు పెద్ద మనిషిలా కనిపించే ఏపీ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్.. రాజకీయాల్లో ఎంతగా రాటుదేలారన్న విషయం తాజాగా ఆయన మాటల్ని చూస్తే ఇట్టే అర్థం కావాలి. ప్రత్యేక హోదా అంశం తిరిగి తెర మీదకు వచ్చిన వేళ.. టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి.. టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు లాంటోళ్లంతా ప్రత్యేక హోదా వ్యవహారం ముగిసిన అధ్యాయంగా చెప్పి ఆ విషయం మీద మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సుజనా.. బొండాలు చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన రీతిలో కొత్తతరహా వాదనలకు తెర తీశారు మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం ఎన్నో ప్రయోజనాల్ని కోల్పోతుందంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర సాయం అవసరమని పేర్కొన్న ఆయన.. పవన్ కల్యాణ్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నట్లుగా మండిపడ్డారు.

ఒకవేళ పవన్ నిజంగానే అన్ని విషయాల్ని రాజకీయం చేయాలని చూస్తే.. మరింత ఘాటుగా మాట్లాడే వీలుంది. అలా కాకుండా ఆచితూచి మాట్లాడినప్పటికి ఈ తరహా విమర్శలు చేస్తే నష్టం కామినేని లాంటి వారికేనన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మాట మార్చిన మోడీ సర్కారును నమ్మాలని.. వారిని నమ్మకుంటే అభివృద్ధే జరగదని.. భారీ నష్టం జరుగుతుందంటూ మంత్రి చెబుతున్న మాటలు చూస్తే.. ఏపీ ప్రజల్ని భయపెట్టేలా ఉందని చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి నోరువిప్పితే చాలు.. నష్టపోతారన్నట్లుగా కామినేని మాటలు చూస్తే.. సుజనా మాదిరే కామినేనికి కూడా పవర్ బాగా తలకు పట్టేసినట్లుగా కనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/