Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠం ఎవ‌రిది..!

By:  Tupaki Desk   |   18 Oct 2016 7:30 PM GMT
ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠం ఎవ‌రిది..!
X
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న విశాఖ‌ప‌ట్నం ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకి సొంత పార్టీ నేత‌లే ఎర్త్ పెడుతున్నారా? ఆయ‌న‌ను అధ్య‌క్ష పీఠం నుంచి సాగ‌నంపేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? హ‌రిబాబుకు వ్య‌తిరేకంగా కోట‌రీ ఇప్ప‌టికే త‌యారైందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. 2014లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హ‌రిబాబు.. పార్టీకి ఏపీలో ఆద‌ర‌ణ ల‌భించేలా చేయ‌డంలోను, చంద్ర‌బాబుతో చెలిమిని కూడ‌గ‌ట్ట‌డంలోనూ ప్ర‌ముఖ పాత్ర పోషించారు. హ‌రిబాబుకు బీజేపీ అధిష్టానం వ‌ద్ద మంచి ప‌ట్టుంది. ఇక‌, ఏపీకి చెందిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి.

2014 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీతో జ‌త‌క‌ట్టి ఎన్నిక‌ల్లో పోటీకి దిగిన క‌మ‌లం పార్టీ ఆ త‌ర్వాత అధికారంలోనూ ఇద్ద‌రు మంత్రుల‌తో త‌న మిత్ర‌త్వాన్ని విస్త‌రించింది. ఈ క్ర‌మంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు నేత‌లు రాష్ట్రంలోని నామినేటెడ్ ప‌ద‌వులు త‌మ‌కు కూడా వ‌స్తాయ‌ని ఆశించారు. అయితే, దేవాల‌యాల‌కు సంబంధించి ఒక‌టి రెండు వ‌చ్చాయే త‌ప్ప మిగిలిన ప్ర‌ధాన నామినేటెడ్ ప‌ద‌వులు వారికి ల‌భించ‌లేదు. దీంతో రాష్ట్ర నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే వారు రాష్ట్ర అధ్య‌క్షుడు కంభంపాటిపై ఒత్తిడి తేవాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే, ఆయ‌న వారికి అపాయింట్‌ మెంట్ కూడా ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్నార‌ని టాక్‌.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ బీజేపీలో క‌ల‌క‌లం రేగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కంభంపాటి విజ‌య‌వాడ న‌గ‌ర అధ్య‌క్షుడిని స‌స్పెండ్ చేశారు. ఈ ప‌రిణామం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఏకంగా నేత‌లు హ‌రిబాబుకు వ్య‌తిరేకంగా మాట‌ల తూటాలు పేల్చ‌డం ప్రారంభించారు. హ‌రిబాబు సీఎం చంద్ర‌బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, కేంద్రం ఏపీకి ఎంతో చేస్తున్నా.. దానిని క‌మ‌ల ద‌ళానికి బ‌లంగా మార్చుకోవ‌డం కంభంపాటి పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొంటూ ఆయ‌న‌ను అధ్య‌క్షుడిగా కొన‌సాగించాల్సి న అవ‌స‌రం లేద‌నే స్థాయికి వివాదాన్ని తీసుకువెళ్లారు.

ఇదే స‌మ‌యంలో ఏపీ అధ్య‌క్ష పీఠం కోసం ఎప్ప‌టి నుంచి కాచుకుని కూర్చున్న సోము వీర్రాజు కంభంపాటిని తొల‌గిస్తే.. త‌న‌ను నియ‌మించేలా పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో వీర్రాజు నేరుగా కాషాయ ద‌ళాధిప‌తి అమిత్ షానే క‌లిసి త‌న మ‌న‌సులో కోరిక‌ను వెల్ల‌డించాడ‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ అధ్య‌క్ష పీఠంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ.. కేంద్ర మంత్రి వెంక‌య్య నుంచి పుష్క‌ల‌మైన అండ‌దండ‌లున్న కంభంపాటిని తొల‌గించే సాహ‌సం బీజేపీ అధిష్టానం చేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఇక‌, అంద‌రూ కోర‌కుంటున్న‌ట్టు సోము వీర్రాజుకు అధ్య‌క్ష పీఠం అప్ప‌గిస్తారా? అనేది కూడా ప్ర‌శ్న‌గానే ఉంది. ఏదేమైనా ఏపీ బీజేపీలో అధ్య‌క్ష పీఠం పోరు భ‌లే రంజుగా మారింద‌న‌డంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/