Begin typing your search above and press return to search.

హ‌రిబాబూ... జ‌నం తిడుతున్నారండీ!

By:  Tupaki Desk   |   25 May 2018 11:16 AM GMT
హ‌రిబాబూ... జ‌నం తిడుతున్నారండీ!
X
తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను వీల‌యినంత త్వ‌ర‌గా గ‌ట్టెక్కించేందుకు విభ‌జ‌న చ‌ట్టంలో ప‌లు హామీల‌ను నాటి యూపీఏ స‌ర్కారు ప్ర‌స్తావించింది. అందులో భాగంగా ఏపీలో కేంద్రీయ విద్యా సంస్థ‌ల‌తో పాటుగా ప‌లు జాతీయ సంస్థ‌లు - ఆర్థిక లోటు భ‌ర్తీ త‌దిత‌ర అంశాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇక వీటికి అద‌నంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కూడా నాడు ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ పార్ల‌మెంటు సాక్షిగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్ కేటాయించే విష‌యాన్ని కూడా నాటి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తావించింది. సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించి విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేస్తామ‌ని న‌మ్మ‌కంగానే చెప్పింది. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన‌దేమిటో మ‌న‌కు వేరే ఎవ‌రూ చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే... నాలుగేళ్లుగా వైసీపీతో పాటు ప‌లు ప్ర‌జా సంఘాలు పోరాటం చేస్తున్న ప్ర‌త్యేక హోదాపై న‌రేంద్ర మోదీ స‌ర్కారు త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తోంది. ఏకంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని, ఇందుకు తాము కార‌ణం కాద‌ని - 14వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌లే కార‌ణ‌మ‌ని కూడా కుంటి సాకులు చెప్పింది.

ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్రంలో రాజ‌కీయ వేడి రాజుకుంది. అప్ప‌టిదాకా మిత్రులుగా ఉండిన బీజేపీ - టీడీపీలు విడిపోయాయి. ఒక పార్టీపై మ‌రో పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు... ఏపీలో అభివృద్ధి బాగానే జ‌రుగుతోంద‌ని - విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌న్నింటినీ దాదాపుగా అమ‌లు చేశామ‌ని చెబుతున్నారు. అయినా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఉన్నా... 14వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌లు అడ్డుగా నిలుస్తున్నాయ‌ని - ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇందులో భాగంగానే కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్య‌క్షుడు - విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు... ఏపీ ప్ర‌జ‌ల‌కు చిర్రెత్తుకొచ్చేలా వ్యాఖ్య‌లు చేశారు.

అయినా హ‌రిబాబు ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఏపీలో అభివృద్ధి వేగంగా సాగుతోందని హరిబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాకు సమానంగా ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రూ.43 వేల కోట్ల నిధులను ఐదేళ్లలో ఇస్తామని ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు దీనికి అదనమని చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల్లో ఎనభై ఐదు శాతం వాస్తవ రూపం దాల్చాయన్నారు. ప‌నిలో ప‌నిగా కేంద్రం తీరును నిరసిస్తూ చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నిందించేందుకు ధర్మపోరాట దీక్ష - సాధికారమిత్ర - మహానాడు పేరిట సభలను నిర్వహిస్తున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పుట్టిన టీడీపీ నేడు అదే పార్టీతో చెట్టాపట్టాలు వేసుకోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని విమర్శించారు. మొత్తంగా మొన్న‌టిదాకా త‌న‌తో క‌లిసి సాగిన పార్టీపై నింద‌లేసిన హ‌రిబాబు... త‌మ పార్టీని మాత్రం ఆకాశానికెత్తేశారు. ఇప్ప‌టికే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ‌ల్ల ఎంతో న‌ష్ట‌పోయామ‌ని ఆగ్ర‌హావేశాల‌తో ర‌గిలిపోతున్న ఏపీ ప్ర‌జ‌లు హ‌రిబాబు వ్యాఖ్య‌ల‌తో మ‌రింత‌గా ర‌గిలిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.