Begin typing your search above and press return to search.

బీజేపీకి కంభంపాటి గుడ్ బై చెప్పబోతున్నారా?

By:  Tupaki Desk   |   4 Oct 2020 11:01 PM IST
బీజేపీకి కంభంపాటి గుడ్ బై చెప్పబోతున్నారా?
X
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని విశాఖ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు కంభంపాటి హరిబాబు.. టీడీపీ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆ ఐదేళ్లు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. కానీ రెండోసారి బీజేపీ గెలిచాక మాత్రం మౌనం పాటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఆయన ఉన్నారు. పార్టీ జాతీయ కమిటీ సభ్యుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆంధ్రప్రదేశ్-బిజెపి ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా హరిబాబు మాత్రం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం లేదన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.

రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కంభంపాటికి పార్టీలో మంచి స్థానం లభిస్తుందని చాలామంది భావించారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పార్టీలో ఇది అత్యంత కీలకమైన పదవి. బిజెపి హైకమాండ్ ఏపీ నుంచి ఆమెకు అత్యున్నత పదవిని పార్టీలో కట్టబెట్టింది. ఇక మొన్నటి ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆమెకు ఎంపి టికెట్ కూడా బీజేపీ ఇచ్చింది..

ఇక బీజేపీలో ఆది నుంచి ఉన్న కంభంపాటికి పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. అంతకుముందు నుంచే ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజా నియామకాల్లోనూ కంభంపాటి పేరు లేకపోవడం గమనార్హం. ఏపీలో పురందేశ్వరికి పెద్ద పదవి దక్కడంతో కంభంపాటికి ఎలాంటి పదవి దక్కదని తేలిపోయింది.

కంభంపాటి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రిటైర్డ్ ప్రొఫెసర్. ఇప్పుడు రాజీనామా చేస్తారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. పార్టీలో పదవి లభించకపోవడంతో కంభంపాటి అలిగారని.. ఆయన తర్వలోనే పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తలు నిజమా? అబద్ధమా అన్నది తెలియదు. రాజీనామా వార్తలపై కంభంపాటి స్పందించలేదు.