Begin typing your search above and press return to search.

బాబుకే శ్రద్ధ లేకుంటే వారు మాత్రమేం చేస్తారని?

By:  Tupaki Desk   |   8 Jan 2018 10:37 PM IST
బాబుకే శ్రద్ధ లేకుంటే వారు మాత్రమేం చేస్తారని?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి ఇంకా రాష్ట్ర ప్రజల్లో ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఏమో.. రాష్ట్రానికి హోదా సాధించడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఏదో ఒక నాటికి ఫలితం ఇస్తుందేమో.. మనకు మంచి జరుగుతుందేమో అని ఆశపడుతున్న వాళ్లు కొందరైనా ఉన్నారు. అయితే వారి ఆశలపై నీళ్లు చిలకరిస్తూ.. హోదాను మించిన ప్యాకేజీ తెచ్చా అంటూ చంద్రబాబునాయుడు మాయ మాటలు చెబుతున్న సంగతి కూడా తెలిసిందే. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికే హోదా గురించి పట్టింపు లేనప్పుడు.. ఇక భాగస్వామ్య పార్టీ అయిన భాజపా వారికి మాత్రం పట్టింపు ఎందుకుంటుంది. అందుకే.. అసలు హోదా అనేది చర్చలోనే లేదు.. అని ఏపీ భాజపా అధ్యక్షుడు ఎంపీ కంభం పాటి హరిబాబు తేల్చేస్తున్నారు. మిగిలిన ఆశల మీద కూడా నీళ్లు గుమ్మరిస్తున్నారు.

అయినా మన తెలుగు పల్లెల్లో ఒక మొరటు సామెత ఉంది. ‘మొగుడు ఒసేయ్ అంటే.. దారినపోయే వాడు కూడా ఒసేయ్ అన్నాట్ట’ అని. అంటే మనవాళ్లు కూడా మనకు గౌరవం ఇవ్వకపోతే.. ఇక బయటివాళ్లు ఏం గౌరవం ఇస్తారు అని దీని అర్థం. అందరూ కలిసి ప్రత్యేక హోదా డిమాండ్ ను మంటగలిపేయడం కూడా ఇలాగే జరుగుతోంది. ముఖ్యమంత్రే దీన్ని నీరు గార్చేస్తోంటే.. ఇక అసలు మోసం చేసిన భాజపా ఎంపీలు మాత్రం ఎందుకు శ్రద్ధ తీసుకుంటారు అనే ఆలోచన ప్రజల్లో నడుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ.. ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటానికి సిద్ధంగానే ఉంది. కాంగ్రెస ఏదో నామమాత్రంగా హోదా డిమాండ్ ను వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే.. జగన్ మాత్రం.. అవసరమైతే.. విధానాల పరంగా ఒక మెట్టు దిగి అయినా సరే.. హోదా ఇచ్చేట్లయితే.. భాజపాకు బేషరతుగా మద్దతు కూడా ఇస్తా.. అని కూడా తేల్చి చెప్పారు. ఒక పార్టీ అంత ఆశతో - అంకితభావంతో హోదా కోసం పోరాడుతోంటే.. అధికారంలో ఉన్న రెండు పార్టీలూ నీరు గారుస్తుండడం శోచనీయం అని ప్రజలు భావిస్తున్నారు.