Begin typing your search above and press return to search.

మాదాపూర్ పీఎస్ కు ఎమ్మెల్యే రోజూ వెళ్లటం ఏమిటి?

By:  Tupaki Desk   |   4 July 2016 10:12 AM GMT
మాదాపూర్ పీఎస్ కు ఎమ్మెల్యే రోజూ వెళ్లటం ఏమిటి?
X
గడిచిన కొద్దిరోజులుగా కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి నిత్యం మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తున్నారు. ఏపీ ఎమ్మెల్యే.. ఇలా హైదరాబాద్ లోని ఒక పీఎస్ కు రోజూ వెళ్లి రావటం ఏమిటన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకిలా అన్న ప్రశ్న వేసుకుంటే.. దీని వెనుక విషయం బయటకు వచ్చింది. అదేమంటే..

ఒక భూవివాదంలో రవీంధ్రనాథ్ రెడ్డి చిక్కుకున్నారు. మాదాపూర్ పరిధిలోని ఖానామెట్ లోని దామర చెరువు ప్రమీలకు 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆక్రమించిన కొందరు నకిలీ పత్రాల్ని సృష్టించారు. వాటిని వేరే వారికి అమ్మేశారు. ఆనంతరం ఆ స్థలం రవీంద్రనాథ్ రెడ్డి పేరు మీద రిజిష్టర్ అయ్యింది. అయితే.. ఇదంతా ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందన్నది బాధిత వర్గాల వాదన.

దీనికి భిన్నమైన వాదనను రవీంద్రనాథ్ వినిపిస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లటం.. ఆయనపై బెదిరింపు ఆరోపణలు రావటంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా గత నెల 23 నుంచి రవీంద్రనాథ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో.. ఆయన ప్రతిరోజూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి వస్తున్నారు. ఇదండి.. కమలాపురం ఎమ్మెల్యే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు రోజూ వెళ్లి రావటం వెనుకున్న అసలు కథ.