Begin typing your search above and press return to search.

యాదాద్రిలో కేసీఆర్‌ కు వ్యతిరేకత!

By:  Tupaki Desk   |   22 Jan 2016 6:52 AM GMT
యాదాద్రిలో కేసీఆర్‌ కు వ్యతిరేకత!
X
యాద‌గిరిగుట్ట. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒక‌టిగా మార్చాల‌ని తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సంక‌ల్పం తీసుకున్న ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్రం. యాద‌గిరిగుట్ట పేరు మార్చి యాదాద్రిగా నామ‌క‌ర‌ణం చేయ‌డం, ఆల‌య అభివృద్ధి కోసం శ‌ర‌వేగంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయ‌డం, సంవత్సరానికి 100 కోట్ల నిధులను మంజూరు చేయ‌డం ఇలా ఎన్నో నిర్ణ‌యాలు కేసీఆర్ తీసుకున్నారు. అయితే ఇపుడు అదే యాద‌గిరిగుట్ట‌లో కేసీఆర్‌ కు కొన్ని వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త ఎదురువుతోంది.

యాదాద్రి అభివృద్ధిలో కీల‌కంగా మారిన రోడ్ల విస్త‌ర‌ణ విష‌యంలో ఈ స‌మ‌స్య వ‌చ్చింది. యాదాద్రికి వెళ్లే దారిని తీర్చిదిద్ద‌డంలో భాగంగా గుండ్లపల్లి నుండి యాదాద్రి ఘాట్‌ రోడ్డు వ‌ర‌కు బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో యాదగిరిగుట్టలో ఉన్న‌ బుచ్చిదాస ఆశ్రమ ప్రహరీని తొలగించాల్సి వ‌స్తోంది. దీన్ని హిందుత్వ‌వాదులు త‌ప్పుప‌డుతున్నారు. తాజాగా కమలానంద భారతీస్వామి ఈ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించి మీడియాతో మాట్లాడారు. బుచ్చిదాస ఆశ్రమం 60 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు - యజ్ఞాలు - యాగాలు - కీర్తనలతో అనునిత్యం వెలుగొందుతోందని, ఈ ఆశ్రమంలో తపఃసిద్ధుల సమాధులు కూడా ఉన్నాయని, వాటిని తొలగించవ‌ద్ద‌ని కోరారు. కింది స్థాయి ఉద్యోగస్తులు కొంద‌రు త‌ప్పుడు ప్ర‌ణాళిక‌లు రూపొందించార‌ని దీనిని సీఎం కేసీఆర్ స‌రిదిద్దాల‌ని చెప్పారు.

యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలనే సీఎం కేసీఆర్‌ కార్యదీక్ష గొప్పదని అయితే బైపాస్ నిమిత్తం బుచ్చిదాస ఆశ్రమంను కూల్చ‌డం స‌రికాద‌న్నారు. ఒక‌వేళ మొండిగా ముందుకుపోతే హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమిస్తారని స్ప‌ష్టం చేశారు.