Begin typing your search above and press return to search.

ట్రంప్ పై నిప్పులు చెరుగుతోంది మ‌న‌మ్మాయిలే!

By:  Tupaki Desk   |   29 Jan 2019 4:59 AM GMT
ట్రంప్ పై నిప్పులు చెరుగుతోంది మ‌న‌మ్మాయిలే!
X
నాకు తోచిందే చేస్తా.. ఎవ‌రేం చెప్పినా ప‌ట్టించుకోనంటూ వ్య‌వ‌హ‌రించే అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ పై భార‌త మూలాలు ఉన్న మ‌హిళ‌లు ఇద్ద‌రు గ‌ళం విప్పారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వారిద్ద‌రు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

అమెరికాలో గ‌తంలో ఎప్ప‌టివ‌ర‌కూ లేనంత‌గా ప్ర‌జాస్వామ్యంపై దాడి జ‌రుగుతోంద‌ని అధ్యక్ష రేసులో నిలిచిన భార‌త సంత‌తి మ‌హిళ క‌మ‌లా హ్యారిస్ విరుచుకుప‌డ్డారు. తాజాగా ఆమె నిర్వ‌హించిన స‌భ‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. ట్రంప్ విధానాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న ఆమె.. ఆదివారం నుంచి త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేశారు.

ట్రంప్ తీరు కార‌ణంగా దేశ ప్ర‌జాస్వామ్యంపై దాడి అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న ఆమె.. స్వేచ్చా పాత్రికేయంపై దాడి.. ఎగ‌తాళి చేసే నాయ‌కులు మ‌న‌కు ఉన్న‌ప్పుడు మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లు నీరుగారుతుంటే అదెప్ప‌టికి అమెరికా కాబోదంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ప‌లువురు దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మ‌రో భార‌త సంత‌తి మ‌హిళ కూడా ట్రంప్ మీద విరుచుకుప‌డుతున్నారు. అధ్యక్ష బ‌రిలో నిలిచిన తుల‌సీ గ‌బార్ట్ తాజాగా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న విమ‌ర్శ‌కుల‌పై మండిప‌డుతున్నారు. తాను భార‌త ప్ర‌ధాని మోడీతో భేటీ కావ‌టాన్ని బూచిగా చూపించి.. త‌న‌ను హిందూ జాతీయ‌వాదినంటూ విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

మోడీతో తాను మాత్ర‌మే కాద‌ని.. ట్రంప్.. ఒబామా.. మాజీ విదేశాంత మంత్రి హిల్ల‌రీలు కూడా భేటీ అయ్యార‌ని.. కానీ వారిని ఎవ‌రూ ఏమీ అన‌కుండా త‌న‌ను మాత్రం త‌ప్పు ప‌ట్ట‌టం స‌రికాదంటున్నారు.

తాను హిందూను కావ‌టంతో ఇలాంటి వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. మ‌త దుర‌భిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం స‌రైన ప‌ద్ద‌తి కాదంటూ ఆమె త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తూ ఒక ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. మొత్తంగా ట్రంప్ తీరును ఇద్ద‌రు భార‌త మూలాలు ఉన్న మ‌హిళ‌లు పోరాడ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.