Begin typing your search above and press return to search.

ఇగోను వదిలేయటానికి రెఢీ.. తలైవా ఏమంటారో?

By:  Tupaki Desk   |   16 Dec 2020 3:11 AM GMT
ఇగోను వదిలేయటానికి రెఢీ.. తలైవా ఏమంటారో?
X
తమిళనాడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎవరికి వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత.. తమిళనాడుకు ఇరువురు రాజకీయ మూలస్తంభాలైన కరుణానిధి.. జయలలితలు లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. నిజానికి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు జీవించి ఉన్నా.. ఇప్పుడున్నంత హడావుడి.. అధికారం కొత్త పార్టీలు ఇంతలా వచ్చేవి కావని చెప్పాలి.

ఒక విధంగా చెప్పాలంటే.. తమిళనాడు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఎన్నికలుగా వీటిని చెప్పాలి. డీఎంకేకు స్టాలిన్.. అన్నాడీఎంకేకు పళనిస్వామి.. పన్నీరు సెల్వం.. వీరిద్దరు సరిపోనట్లుగా చిన్నమ్మ.. వారికి పోటీగా విజయకాంత్.. మొన్ననే తెర మీదకు వచ్చిన కమల్ హాసన్.. వీరికి తోడుగా తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ తో పాటు.. మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీలు సైతం ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇలాంటివేళ.. విశ్వకథానాయకుడు.. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తలైవా రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాను సిద్దమన్నారు. తామిద్దరం ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉన్నట్లు చెప్పిన ఆయన.. తమ సిద్ధాంతాలు దగ్గరగా ఉండి.. ప్రజలకు మేలు జరుగుతుందన్న పక్షంలో తన ఇగోను పక్కన పెట్టటానికి సిద్ధమన్నారు.అన్నింటిని పక్కన పెట్టేసి సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమల్ పేర్కొన్నారు. రజనీ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీ.. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబరు 31న పార్టీ వివరాలు ప్రకటిస్తానని.. జనవరి ఒకటిన రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పటం తెలిసిందే. దీంతో.. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారి రాజుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్.. మేలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్..రజనీ పార్టీలు బరిలోకి దిగటం ఖాయమైన వేళ.. ఆ రెండు పార్టీల్లో కీలకమైన నేత ఒకరు చేసిన ఆఫర్ కు మరొకరు ఏలా స్పందిస్తారు? ఆ ప్రభావం తమిళ రాజకీయాల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికర అంశాలుగా చెప్పక తప్పదు. ఇంతకీ.. కమల్ మాటకు.. రజనీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.