Begin typing your search above and press return to search.

తమిళ సర్కారును కడిగి పారేసిన కమల్

By:  Tupaki Desk   |   5 Dec 2015 12:27 AM IST
తమిళ సర్కారును కడిగి పారేసిన కమల్
X
భారీ వర్షాలతో నిండా మునిగిపోయిన చెన్నై మహానగరాన్ని.. లక్షలాది మంది ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసిన మహానటుడు కమల్ హాసన్ కు కోపం వచ్చింది. ఒక దారుణమైన ప్రకృతి వైపరీత్యానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు.. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైనా ఆయన తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్న ఇంట్లో ఉన్నా. కానీ.. నాలో తప్పు చేసిన భావనలో ఉన్నా. ఎందుకంటే.. నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ.. నా బంధువులు.. స్నేహితులు ఏ మాత్రం బాగోలేరు. వర్షాల కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. వారేమో కష్టాల్లో ఉంటే నేను సౌకర్యవంతంగా ఉండటం ఏమిటి?’’ అని వేదన చెందుతున్న ఆయన.. విపత్తు సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి.. విప్తతులు ఏర్పడినప్పుడు.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. తప్పుల్ని ఎత్తి చూపేందుకు ఏ మాత్రం సాహసించరు. మిగిలిన వారి సంగతేమో కానీ.. సినిమా యాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కమల్ హాసన్. తనకు జయ సర్కారు మీద గౌరవం ఉందంటూనే.. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో కడిగిపారేశారు.

ప్రభుత్వాన్ని దేని కోసమైతే ఎన్నుకున్నారో.. దాని బాధ్యత నిర్వహించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కురిసిన దారుణ వర్షాల కారణంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అచేతనంగా మారిపోయిందని మండిపడిన ఆయన.. తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలోనే ఇంత దారుణ పరిస్థితి ఉంటే.. మిగిలిన ప్రాంతాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. పన్నులు కడుతున్న వారి డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయని అడిగిన కమల్.. తన ప్రజలకు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. కష్టాలు వచ్చినప్పుడు తమకోసం ఏ పని చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకున్నామో.. అదే పనిని వారు చేయటానికి విరాళాలు అడగటం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు చూస్తే.. కమల్ హాసన్ ఆగ్రహం ధర్మాగ్రహంగా కనిపించక మానదు.