Begin typing your search above and press return to search.

కమల్ ఎర్రజెండా కాదు.. సొంత జెండానే!

By:  Tupaki Desk   |   16 Sep 2017 4:20 AM GMT
కమల్ ఎర్రజెండా కాదు.. సొంత జెండానే!
X
సినీ నటుడు కమల్ హాసన్ కొంత కాలంగా రాజకీయంగా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి అందరూ గుర్తిస్తున్నారు. తమిళనాడులో అమ్మ పురట్చి తలైవి మరణం తర్వాత.. ఏర్పడిన గందరగళ పరిస్థితులు, రాజకీయ శూన్యతను వాడుకునే ప్రయత్నాల్లో భాగంగా రజినీకాంత్ - కమల్ హాసన్ ఇద్దరూ కూడా రాజకీయ పార్టీ స్థాపన ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కూడా కొన్ని సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కమల్ చాలా దూకుడు ప్రదర్శించారు కూడా!

కమల్ హాసన్ పార్టీ విషయంలో ఇప్పుడు ఇంకాస్త క్లారిటీ వచ్చింది. ఆయన రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే సొంత పార్టీ పెడతారే తప్ప.. ప్రస్తుత పార్టీల్లో చేరకపోవచ్చునని తేలింది. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు.

కమల్ హాసన్.. అన్నా డీఎంకే సర్కారు మీద ఆన్ లైన్, సోషల్ మీడియా వేదికగా ఒక రేంజిలో తన పోరాటాన్ని ఇదివరకే ప్రకటించారు. ప్రజలందరూ అన్నా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కూడా పలుమార్లు పిలుపు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన డీఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం, రజినీకాంత్ వేదికి కిందనే సభికుల్లో కూర్చుండిపోగా, తాను వేదిక ఎక్కి ముఖ్య అతిథిగా ఉండి ప్రసంగించడం కొన్ని పుకార్లకు తావిచ్చిం. అలాగే సీపీఎం పార్టీ సభలకు కూడా కమల్ హాజరయ్యారు. వీటివల్ల.. ఆయన డీఎంకేలో గానీ, కమ్యూనిస్టు పార్టీల్లో గానీ చేరే అవకాశం ఉందా అనే ఊహాగానాలు సాగాయి.

ఈ విషయంలో కమల్ హాసన్ తాజాగా స్పష్టత ఇచ్చారు. తాను ఇతర పార్టీలకు చెందిన నాయకులను కలిసినంత మాత్రాన వారితో ఫోటోలు దిగినంత మాత్రాన ఆయా పార్టీల్లో చేరిపోతున్నట్లుగా ప్రచారం జరిగితే.. నేనేమీ చేయలేను. నేను రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే.. సొంత పార్టీ ద్వారానే వస్తాను. నేను జీవించి ఉండగా అది అధికారంలోకి రాకపోవచ్చు.. కానీ మార్పుకు శ్రీకారం చుడతాను. నా తర్వాతి వారు.. ఆ పని సాధించవచ్చు. అంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లో రజినీకాంత్ తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు. మొత్తానికి కమల్ నడక సొంతపార్టీ దిశగానే ఉన్నదని.. ద్రవిడ రాజకీయాలు త్వరలో మరికొన్ని మలుపులు తిరుగుతాయని అనుకోవచ్చు.