Begin typing your search above and press return to search.
యాంటీ మోడీ ఫోర్స్ పై కమల్ ఆసక్తి
By: Tupaki Desk | 24 May 2018 4:51 PM GMTసినిమా నటులు చాలా మంది రాజకీయాల్లోకి వస్తుంటారు. కొన్ని కొందరు మాత్రమే పూర్తి అవగాహనతో ఉంటారు. అన్ని గమనించి అర్థం చేసుకోగలడం - ఇతర రాజకీయ వ్యవహారాలపై స్పందించడం చేస్తుంటారు. ఇట్లాంటి వారిలో ప్రకాష్ రాజ్ - కమల్ హాసన్ ... ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు ఇద్దరిదీ యాంటీ మోడీ దారే. ఇద్దరూ దేశంలోని ఏ అంశంపైన అయినా స్పందించగలరు. పైగా ఇద్దరు వార్తలను బాగా ఫాలో అవుతారు. ప్రకాష్ రాజ్ అయితే ఏకంగా కర్ణాటక ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేశారు. చివరకు అనేక ట్విస్టుల అనంతరం ఎన్నో సమీకరణాల నేపథ్యంలో బీజేపీని నేలరాల్చడంలో యాంటీ మోడీ ఫోర్స్ సక్సెస్ అయ్యింది. ఈ సంబరాన్ని వేడుకగా చేసుకోవడానికి దేశంలోని ప్రముఖ నేతలు కర్ణాటకకు రావడం చూస్తుంటే... మోడీ వ్యతిరేకత ఆ కూటమిలో ఎంతుందో ఇట్టే తెలిసిపోతుంది. వీటన్నింటినీ గమనిస్తూ ఈ సంఘటనలపై తాజాగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కమల్ హాసన్ స్పందించారు.
ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం పంపినందుకు కుమారస్వామికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అదే సందర్భంగా ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కమల్. దేశంలో శూన్యత ఉంది. ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రమే కాకుండా ప్రజలను ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశానికి కూడా అప్రతిష్ట తెస్తోంది. అందుకే వ్యూహరచనకు - అనేక పార్టీల సమ్మేళనానికి - సమూహంగా ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం అని అనుకుంటున్నాను అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. బీజేపీయేతర కూటమి మంచిదే అనుకుంటున్నా, మరి ఇది ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చూడాలన్న ఆత్రుతతో ఉన్నానని కమల్ పేర్కొన్నారు.