Begin typing your search above and press return to search.

మరో 50 ఏళ్లు.. కమల్ హాసన్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   22 Feb 2022 3:30 PM GMT
మరో 50 ఏళ్లు.. కమల్ హాసన్ సంచలన ప్రకటన
X
తారలు రాజకీయాల్లో సక్సెస్ కావడం చాలా అరుదు. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి కొద్దిమంది రాజకీయాలను ఏలారు. కానీ ఆ తర్వాత నేటితరంలో అలాంటి సామర్థ్యాలు ఏ హీరోకు లేకుండా పోయాయి. తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారు. ఇక తమిళనాడులో కమల్ హాసన్ లాంటి వారు విఫలమయ్యారు.

తాము సొమ్ము చేసుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజా సేవ చేయడానికే వచ్చానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్ హాసన్ తెలిపారు. తనను అడ్డం పెట్టుకొని గల్లాపెట్టే నింపుకొనే యత్నం చేసిన వారందరినీ బయటకు పంపించినట్టు పేర్కొన్నారు.

మక్కల్ నీది మయ్యం పార్టీ ఏర్పాటు చేసి సోమవారంతో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చెన్నై అళ్వార్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుక నిరాడంబరంగా సాగింది. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కమల్ హాసన్ ప్రకటించారు. తన జీవితం ప్రజల కోసమేనని.. ఆ దిశగా రామేశ్వరంలో పార్టీ ఆవిర్భావ వేడుక జరిగిందని గుర్తు చేశారు. ఈ సమయంలో తన వెన్నంటి ఉన్న వాళ్లు ఇప్పుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పార్టీలోకి కొందరు వ్యాపార దృక్పథంలో పార్టీలోకి వచ్చారని.. మరికొందరు తనను అడ్డం పెట్టుకొని వారి గల్లాపెట్టే నింపుకునే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు నినాదంతోనే తన పయనం కొనసాగుతుందన్నారు. పంచాయితీలు, బెదిరింపులతో ఆస్తులు కూడబెట్టుకునే కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనను కొందరు నాన్న అని.. మరికొందరు తాతా అని.. ఇంకొందరు బిగ్ బాస్ అని పిలుస్తూ వారి ప్రేమను చాటుకుంటున్నారని వివరించారు.

చిన్నప్పటి నుంచి తన మీద ఉంచిన అభిమానం.. ప్రేమ రాష్ట్ర ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదని కమల్ హాసన్ పేర్కొన్నారు. మార్పు నినాదంతో ప్రజల జీవితల మెరుగు కోసం తాపత్రయపడుతున్నానని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు తాను ఉన్నా లేకున్నా, మరో 50 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు.