Begin typing your search above and press return to search.

అభిమానుల అత్యుత్సాహం.. గాయంతో ఆసుపత్రికి కమల్

By:  Tupaki Desk   |   21 March 2021 5:02 PM IST
అభిమానుల అత్యుత్సాహం.. గాయంతో ఆసుపత్రికి కమల్
X
సెలబ్రిటీ కనిపించిన వెంటనే వారి చుట్టూ మూగిపోవటం.. వారి మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించే క్రమంలో కొన్ని సందర్భాల్లో మోతాదు మించిపోయేలా వ్యవహరిస్తారు. అలాంటి సమయంలో కాస్త కఠినంగా చెబితే.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. సెల్ఫీలు.. సోషల్ మీడియాలు ఎక్కువైన తర్వాత.. సెలబ్రిటీ బయట కనిపిస్తే చాలు.. వారికి కొత్త ఇబ్బందులకు గురయ్యేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే విశ్వనటుడుకు ఎదురైంది. ఇన్నాళ్లు వెండి తెర మీద వెలిగిపోయిన తమ అభిమాన నటుడు.. ఇప్పుడు ఏకంగా ప్రజాసేవకు వచ్చేయటం.. తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మా జోరుగా ప్రచారం చేస్తున్న వైనం తెలిసిందే.

మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా కమల్ తన ప్రచార వేగాన్ని పెంచాడు. తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరులో మార్నింగ్ వాక్ కు వెళ్లిన కమల్ ను చూసిన ఆయన అభిమాని ఒకరు ఆయన్ను గుర్తించి పలుకరించారు. అంతలో చుట్టూ పెద్ద ఎత్తున కమ్మేశారు. ఎవరికి వారు కమల్ తో ఫోటో దిగేందుకు ప్రయత్నించటంతో హడావుడి నెలకొంది. అభిమానతార కనిపించేసరికి ఆనందం పట్టలేక.. ఒక వ్యక్తి తన బూటు కాలితో కమల్ కాలి మీద బలంగా తొక్కేయటంతో ఆయన తీవ్ర నొప్పికి గురయ్యారు.

దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎక్స్ రే తీసిన వైద్యులు.. ఆరోగ్యం నిలకడగా ఉందని.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. మార్నింగ్ వాక్ ఏమో కానీ.. మొదటికే మోసం వచ్చినట్లుగా మారిందిగా. ప్రచారం జోరుగా చేయాలనుకున్న కమల్ ఇప్పుడు ఇంటికే పరిమితం కావటం గమనార్హం.