Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ రంగు... కాషాయం కాద‌ట‌!

By:  Tupaki Desk   |   2 Sep 2017 8:09 AM GMT
క‌మ‌ల్ రంగు... కాషాయం కాద‌ట‌!
X
త‌మిళ‌నాట రాజకీయ తెరంగేట్రం చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధ చేసుకున్న ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌... రాజ‌కీయంగా త‌న బాట‌ - సిద్ధాంతం ఎలా ఉండబోతుంద‌న్న విష‌యంపైనా క్లారిటీ ఇచ్చేశారు. చాలా విభిన్న‌మైన క‌థాంశాల‌తో కూడిన సినిమాల్లో న‌టించిన క‌మ‌ల్‌... అవినీతి ప‌రుల భ‌రతం ప‌ట్టే పాత్ర‌ల్లో ఒదిగిపోయార‌ని చెప్పాలి. క‌మ‌ల్ న‌టించిన *భార‌తీయుడు* చిత్రం ఇందుకు హైలెట్‌ గా నిలుస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌ద‌రు చిత్రంలో అవినీతికి పాల్ప‌డ్డ వ్య‌క్తి త‌న క‌న్న కొడుకైనా వ‌దిలిపెట్టే ప్ర‌సక్తి లేద‌ని భావించే ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి పాత్ర‌లో క‌మ‌ల్ ఒదిగిపోయార‌ని చెప్పాలి.

మ‌రి రాజ‌కీయంగా క‌మ‌ల్ బాట ఎలా ఉండ‌బోతుందన్న అంశంపై ఇప్ప‌టికే ప‌లు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. డీఎంకేకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే క‌మ‌ల్ అదే పార్టీలో చేరిపోతార‌ని కొంద‌రు అంటుంటే... జాతీయ పార్టీ అయిన బీజేపీతో జ‌ట్టు క‌ట్టి క‌మ‌ల్ ముందుకు సాగుతార‌ని మ‌రో వాద‌న వినిపించింది. అయితే త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై మాత్రం క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్... త‌న భవిష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, త‌న వైఖ‌రిని మాత్రం వెల్ల‌డించ‌లేద‌నే చెప్పాలి. తాజాగా ఆ విష‌యంలోనూ క‌మ‌ల్ కాస్తంత క్లారిటీ ఇచ్చార‌ని చెప్పాలి. నిన్న కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం వెళ్లిన క‌మ‌ల్‌... అక్క‌డ లెఫ్ట్ పార్టీ నేత - కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. త‌మిళ‌నాడులోని ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితిపై ఆయ‌న‌తో చ‌ర్చించేందుకే ఆయ‌న‌తో భేటీ అయ్యాన‌ని కూడా ఆ త‌ర్వాత క‌మ‌ల్ చెప్పుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీతో జ‌ట్టు క‌డ‌తారా? అన్న మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌కు సూటిగానే స్పందించిన క‌మ‌ల్‌... అలాంటిదేమీ లేద‌ని తేల్చిపారేశారు. అస‌లు బీజేపీతో జ‌త‌క‌ట్టే యోచ‌నేదీ లేద‌న్న భావ‌న వినిపించేలా... త‌న రంగు కాషాయం కాద‌ని క‌మ‌ల్ కుండ‌బ‌ద్దలు కొట్టేశారు. అంటే... క‌మ‌ల్ పెట్టే పార్టీ బీజేపీ సిద్ధాంతాల‌కు వ్యతిరేకంగానే ముందుకు సాగుతుంద‌న్న మాట‌. వామ‌ప‌క్షాల వైఖ‌రితో ముందుకు సాగే దిశ‌గా యోచిస్తున్న‌ట్లు క‌మ‌ల్ తెలిపారు. ఈ విష‌యాన్ని కూడా సూటిగా చెప్ప‌ని క‌మ‌ల్‌... త‌న ప్ర‌సంగంలో వామ‌ప‌క్షాల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. వామ‌ప‌క్ష నేత‌ల‌ను హీరోలుగా అభివ‌ర్ణించిన క‌మ‌ల్‌... త‌మిళ రాజ‌కీయాల్లోనూ వారు మ‌రింత క్రియాశీల పాత్ర‌ను పోషించాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. అంటే క‌మ‌ల్ రాజ‌కీయ ప‌య‌నం లెఫ్టిస్టు భావాల‌తోనే ముందుకు సాగుతుంద‌న్న మాట‌.