Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి మద్దతు అంటున్న కమల్ హాసన్

By:  Tupaki Desk   |   25 Jan 2023 11:32 PM GMT
కాంగ్రెస్ కి మద్దతు అంటున్న కమల్ హాసన్
X
విశ్వనటుడు కమల్ హాసన్ వెండి తెర మీద కళాభినివేశం చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే. బాలనటుడిగా మొదలైన ఆయన కెరీర్ ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఎలాంటి పాత్రలు అయినా వేయగల సామర్ధ్యం ఉన్న నటుడు ఆయన. అలాంటి కమల్ హాసన్ లో సామాజిక స్పృహ ఉంది. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. సొంతంగా ఒక పార్టీని తమిళనాట స్థాపించారు.

ఆయన పార్టీ పేరు మక్కల్ నీది మయ్యం. ఆయన భావజాలం బీజేపీకి యాంటీగా ఉంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ భావజాలానికి ఇపుడు దగ్గర అవుతున్నారు అనిపిస్తోంది. మోడీ అంటే పడని కమల్ కి దేశంలో ప్రధాన జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తో కలసి నడవడమే అనివార్యం అవుతోంది అంటున్నారు.

ఈ మధ్య రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో కమల్ హాసన్ పాలుపంచుకున్నారు. ఆయనతో పాటు సభలో ప్రసంగించారు. ఇద్దరూ కలసి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇలా కమల్ హాసన్ కాంగ్రెస్ తో తన రాజకీయ బంధాన్ని మెల్లగా పెనవేసుకుంటున్నారు అన్న సంకేతాలు ఇచ్చేశారు. ఇపుడు ఆయన మరో అడుగు ముందుకేశారు. అదేంటి అంటే తమిళనాడులో జరుగుతున్న ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం.

ఇది నిజంగా అనూహ్యమైన పరిణామం అనే చెప్పాలి. కమల్ హాసన్ తమిళనాడులోని ఈ రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వామే కాదు ప్రచారం కూడా చేస్తాను అని అంటున్నారు. ఈ సందర్భంగా కమల్ కీలకమైన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయం మీద కీలక నిర్ణయం ఉంటుందని అన్నారు.

దీన్ని బట్టి కమల్ కి కాంగ్రెస్ తో కలసి ఉంటే బెటర్ అన్న భావన కలిగిందని అర్ధం అవుతోంది. 2021 లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇపుడు ఆయనకు తత్వం బోధపడింది అని అంటున్నారు. అయితే మరో విషయం ఏంటి అంటే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కూడా కాంగ్రెస్ కి మిత్రపక్షమే.

అంటే ఒక విధంగా డీఎంకేకు ఎదురు వెళ్లకుండా కమల్ తన స్నేహాన్ని చాటుకుంటున్నారు అని అనుకోవాలేమో. ఇక కమల్ రానున్న రోజుల్లో డీఎంకేకు ఆల్టర్నేషన్ గా తన పార్టీని రూపొందిస్తారా లేక ఆ పార్టీకి మిత్రులలో కాంగ్రెస్ నేస్తంగా మిగులుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఒంటరిగా పోటీ చేస్తే గెలవం అని అర్ధమైన తరువాత పొత్తులతోనే కధ మార్చుకోవాలి. ఏపీలో పవన్ అదే చేస్తున్నారు. కమల్ కూడా ఆ బాటలోనే సాగుతున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.