Begin typing your search above and press return to search.

'క‌షాయం' వివాదంలో క‌మ‌ల్‌...కేసు న‌మోదు

By:  Tupaki Desk   |   20 Oct 2017 8:22 AM GMT
క‌షాయం వివాదంలో క‌మ‌ల్‌...కేసు న‌మోదు
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న రాజ‌కీయ అరంగేట్రానిని వ‌డివ‌డిగా పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త పార్టీని ప్ర‌క‌టించాల‌ని క‌మ‌ల్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత పార్టీ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణం - రాబోయే ఎన్నిక‌ల‌లో అనుస‌రించాల్సిన వ్యూహాల గురించి ప్ర‌ణాళిక‌లు ర‌చించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయాలు - సినిమాలతో పాటు సామాజిక అంశాల‌పై కూడా క‌మ‌ల్ స్పందిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ఔష‌ధంపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మయ్యాయి. దీంతో, ఆ మందు పంపిణీదారులు.... క‌మల్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, క‌మ‌ల్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

డెంగ్యూ - చికెన్ గున్యా లాంటి జబ్బులు రాకుండా తమిళ ప్రజలకు నీలవేంబు కుదినీర్ అనే మందు పంపిణీ చేస్తున్నారు. ఆ మందులోని ఓ కారకం వ‌ల్ల మనుషుల్లో వంధ్యత్వం (ఇన్-ఫెర్టిలిటీ) వ‌స్తుంద‌ని క‌మ‌ల్ ఆరోపించారు. నీలవేంబు చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ఈ కషాయం వల్ల మనుషులు నపుంసకులవుతారని కమల్ చెప్పారు. దాని ఆ మందు శాస్త్రీయ‌త‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే పంపిణీ చేయాల‌ని తన అభిమానులకు పిలుపునిచ్చారు. కేవ‌లం అల్లోప‌తి వైద్యులు మాత్ర‌మే .ప‌రిశోధ‌న‌లు చేయ‌డం కాద‌ని, సంప్ర‌దాయంగా వ‌స్తున్న ఈ త‌ర‌హా క‌షాయాల‌పై కూడా ప‌రిశోధ‌న‌లు జ‌రిగాకే ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయాల‌ని క‌మ‌ల్ సూచించారు. కమల్ చేసిన వ్యాఖ్యలు తమ హక్కులకు భంగం క‌లిగించేలా ఉన్నాయని ఈ మందు పంపిణీ సభ్యుల్లో ఒకరు చెన్నై కమిషనరేట్ కు ఫిర్యాదు చేశారు. మనుషులలో ఉండే భయాల్ని కమల్ ప్రేరేపిస్తున్నార‌ని పేర్కొన్నారు.

క‌మ‌ల్ ....తమిళనాడుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు ...క‌మ‌ల్ హాస‌న్ పై కేసు న‌మోదు చేశారు. క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌ను త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ కూడా ఖండించింది. ఈ కషాయం వాడకం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేసింది. నీల‌వేంబు కషాయాన్ని చెన్నైలోని కింగ్ ఇన్ స్టిట్యూట్ లో ప‌రిశోధించామ‌ని, ఆ త‌ర్వాతే ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. పూర్తి అవగాహన లేకుండా కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఆయన అభిమానులు వత్తాసు పలుకుతున్నారు.