Begin typing your search above and press return to search.

తమిళ రాజకీయాల్లో కమల్ సునామీ

By:  Tupaki Desk   |   22 July 2017 4:15 AM GMT
తమిళ రాజకీయాల్లో కమల్ సునామీ
X
ఆయన ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు. కానీ ఆయన మాటలు అప్పుడే తమిళనాట రాజకీయాలను సునామీలా దెబ్బ కొడుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆయన సవాళ్లకు ప్రతిసవాళ్లు విసరాలంటే భయపడుతున్నారు. ఆయన దెబ్బకు జడుసుకుని.. మంత్రిత్వశాఖలకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్స్ నుంచి మంత్రుల కాంటాక్ట్ చిరునామాలు, ఈ మెయిల్ అడ్రసులు, ఫోను నెంబర్లను తొలగించేశారంటే.. ఒక వ్యక్తి - శక్తిగా మారి చూపుతున్న ప్రభావం ఏపాటిదో మనకు అర్థం అవుతుంది. ఆయనే కమల్ హాసన్. ఒకప్పట్లో తమిళనాడు రాజకీయాల కారణంగా సినిమా రంగం ఎంత నష్టపోతున్నదో, ప్రత్యేకించి తన సినిమాలు ఎంత నష్టపోతున్నాయో అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు తాను ఒక రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో అవినీతి పార్టీలను ఎంతగా నష్టపరచగలనో నిరూపించుకుంటున్నారు.

తమిళనాడులో కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టడానికి దాదాపుగా సిద్ధపడినట్లే. తమిళ రాజకీయాలు ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో కానీ.. ఇప్పుడు మాత్రం అచ్చంగా సినిమా పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నట్లు భావించాలి. జయలలిత మరణించిన తర్వాత.. తలైవా రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ సన్నాహాల్లో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఆయన సోదరుడు ఒక ముహుర్తం కూడా ప్రకటించి , త్వరలోనే రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్న సంగతిని వెల్లడించారు. రజనీ ఇంకా తుదినిర్ణయానికి వచ్చేలోగానే కమల్ సునామీ మొదలైపోయింది. ప్రభుత్వంలోని అన్నిశాఖలూ అవినీతితో నిండిపోయాయని అంటూ కమల్ హాసన్ ఒక ప్రకపనను స్టార్ట్ చేశారు. సాక్ష్యాలు చూపించాలని మంత్రులు ఎదురు ప్రశ్నించడంతో ఆయన తన అభిమానులను పురిగొల్పారు. ఏయే శాఖల్లో ఎలాంటి అవినీతి ఉందో.. ఆయా మంత్రిత్వశాఖల వెబ్ సైట్లలో డైరక్టుగా ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కమల్ పిలుపునకు మంచి స్పందనే వచ్చింది. ప్రజలు పెద్ద సంఖ్యలో మెయిళ్లు - మెసేజీలు పెడుతుండడంతో.. మంత్రులు బెంబేలెత్తిపోయి.. వెబ్ సైట్ల నుంచి కాంటాక్ట్ అడ్రసులు - ఫోను నెంబర్లు మొత్తం తొలగించేశారు.

కమల్ హాసన్ ఇక రాజకీయ పార్టీ గురించిన ప్రకటన చేయడం ఒక్కటే తరువాయి అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోకే కమల్ రంగప్రవేశం ఉంటుందనే ఊహాగానాలు నడుస్తున్నాయి. తన చిత్రాల ద్వారా ఎంతో సామాజిక మార్పును అభిలషించిన, దేశంలోనే గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న కమల్ హాసన్ తమిళ రాజకీయాల ప్రక్షాళనకు పూనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.