Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ మాట‌ల‌కు జ‌నాల‌కు క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్‌

By:  Tupaki Desk   |   13 Oct 2017 9:27 AM GMT
ఫ్రెండ్ మాట‌ల‌కు జ‌నాల‌కు క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్‌
X
సినీ తార‌లు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌టం కొత్త విష‌యం కాదు. కొన్ని ద‌శాబ్దాలుగా సాగుతున్న వ్య‌వ‌హార‌మే. కానీ.. తాజాగా ఆ లెక్క‌ల్లో ఏదో తేడా వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. గ‌తంలో మాదిరి రొడ్డు కొట్టుడు లెక్చ‌ర్లు ఇవ్వ‌కుండా.. రోటీన్ కు భిన్నంగా మాట్లాడుతున్న వైనం క‌నిపిస్తోంది.

తాజాగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌టానికి స‌న్నాహాలు చేసుకుంటున్న ఇద్ద‌రు సినీ ప్ర‌ముఖుల్లో ఒక‌రు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అయితే మ‌రొక‌రు విశ్వ‌నాయ‌కుడిగా పిలుచుకునే క‌మ‌ల్ హాస‌న్‌. తన పొలిటిక‌ల్ ఎంట్రీ మీద క‌మ‌ల్ క్లారిటీ ఇవ్వ‌గా.. ర‌జ‌నీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల జ‌రిగిన ఒక కార్య‌క్రమానికి ర‌జ‌నీ.. క‌మ‌ల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ కానీ త‌న‌ను ముందే అడిగి ఉంటే.. తాను ఆయ‌న వెంట న‌డిచేవాడిన‌ని చెప్పారు.

ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు మెచ్చుకుంటూ.. మ‌ర్యాద‌గా మాట్లాడుకోవ‌టం.. ఒక‌రి గురించి మ‌రొక‌రు గొప్ప‌గా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు రాసిన కాల‌మ్ లో క‌మ‌ల్ ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్రస్తావించారు. త‌న‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన ర‌జ‌నీ గురించి.. తాను ఎంట్రీ ఇవ్వ‌నున్న రాజ‌కీయాల గురించి కొన్ని విష‌యాన్ని చెప్పుకొచ్చారు.

రాజ‌కీయాల్లో గెలుపు ఒక్క‌టే ముఖ్యం కాద‌ని.. అంత‌కు మించింది కావాలంటూ ఇటీవ‌ల ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య మీద స్పందించారు క‌మ‌ల్ హాస‌న్‌. ఈ విష‌యాన్ని నేరుగా ర‌జ‌నీకే ఫోన్ చేసి చెప్పొచ్చు క‌దా? అని అడ‌గొచ్చ‌ని.. కానీ.. ర‌జ‌నీకి క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. త‌మిద్ద‌రి మ‌ధ్య స్నేహం అలాంటిద‌న్నారు.

త‌మిద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం గురించి చాలామందికి అర్థం కాద‌న్న క‌మ‌ల్‌.. అస‌లు గెలుపు అంటే ఏమిటి? ఓ కొత్త పార్టీ పెట్టి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకొని మెజార్టీతో గెలిచి సీఎం అయిపోవ‌ట‌మా? అంటూ ప్ర‌శ్నించిన క‌మ‌ల్.. నమ్మ‌కాన్ని పోగొట్టుకోకుండా మంచి చేయ‌టం కూడా గెలుపేన‌ని చెప్పారు. కొన్నేళ్ల క్రితం పార్టీ పెట్టి గెలిచిన వారు సైతం ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యం.. విద్య ప‌రంగా ఎలాంటి అభివృద్ధి చేయ‌లేద‌ని గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. క‌మ‌ల్ మాట‌ల్ని నిశితంగా ప‌రిశీలిస్తే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది అధికారం కోస‌మ‌న్న‌ట్లు కాకుండా.. ప్ర‌జ‌ల జీవితాల్లో ఏదో మార్పు తేవాల‌న్న త‌ప‌న కనిపించ‌క మాన‌దు. మ‌రి.. ఇలాంటి వారు నేటి రాజ‌కీయాల‌కు సూట్ అవుతారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. దీనికి స‌మాధానం కాలం మాత్రం బాగా చెప్ప‌గ‌ల‌దు.