Begin typing your search above and press return to search.

కమల్ పొలిటికల్ పార్టీ.. తొలి అడుగు పడింది

By:  Tupaki Desk   |   6 Nov 2017 7:12 AM GMT
కమల్ పొలిటికల్ పార్టీ.. తొలి అడుగు పడింది
X
రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్.. ఆ దిశగా కార్యాచరణను ప్రకటించాడు. ఐతే తాను నెలకొల్పబోయే రాజకీయ పార్టీ రావడానికి ఇంకా చాలా సమయం ఉందని కమల్ ప్రకటించాడు. ఒక బిడ్డ పుట్టడానికి పది నెలల సమయం పట్టినట్లుగా.. తన పార్టీ రావడానికి కూడా ఇంకో పది నెలల సమయం ఉందని.. ఈ లోపు పార్టీని పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు. తన 63వ పుట్టిన రోజు సందర్భంగా నవంబరు 7న (మంగళవారం) తన పార్టీ కోసం ఒక మొబైల్ యాప్ లాంచ్ చేయబోతున్నట్లు కమల్ ప్రకటించాడు. తన పార్టీ ఏర్పాటు దిశగా ఇది తొలి అడుగు అని కమల్ వెల్లడించారు.

ఈ యాప్ తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ముందడుగు అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని అంటారని.. కానీ తన దగ్గర అంత డబ్బు లేదని.. అలాగని తనకు ఆ విషయంలో భయం కూడా లేదని కమల్ అన్నాడు. తన అభిమానులే తనకు డబ్బులిస్తారని.. ఆ డబ్బులతో పార్టీని నడిపిస్తానని ఆయన చెప్పారు. తాను మొదలుపెట్టబోయే యాప్ లో విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని.. అన్ని విషయాలూ పారదర్శకంగా ఉండేలా చూసుకుంటామని కమల్ తెలిపాడు. తమిళనాడు మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఈసారి తాను పుట్టిన రోజు వేడుకలు చేసుకోవట్లేదన్నాడు కమల్. ఇది కేక్ కట్ చేయాల్సిన సమయం కాదని.. వరద నీరు పారడానికి కాలువలు తవ్వాల్సిన సమయమని కమల్ వ్యాఖ్యానించాడు.