Begin typing your search above and press return to search.

సేవా హక్కు చట్టాన్ని తెరపైకి తెచ్చిన కమల్ హాసన్

By:  Tupaki Desk   |   8 Jan 2022 3:30 AM GMT
సేవా హక్కు చట్టాన్ని తెరపైకి తెచ్చిన కమల్ హాసన్
X
సేవా హక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. దీని వల్ల కాలపరిమితిలో అనేక సేవలు అందుతాయని, చివరికి అవినీతిని అరికట్టవచ్చని కమల్ హాసన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, చట్టపరమైన వారసుల ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డును సకాలంలో పొందడంలో ఈ చట్టం సహాయపడుతుందని ఎంఎన్ఎం చీఫ్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు అయినందున శుక్రవారం నాడు చట్టాన్ని ఆమోదించాలని నటుడు-రాజకీయవేత్త కమల్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ 2019లో సేవా హక్కు చట్టాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని, అధికార డీఎంకే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, గవర్నర్ కూడా హామీ ఇచ్చారని కమల్ హాసన్ అన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగంలో సీఎం స్టాలిన్ సైతం ప్రస్తావించారని కమల్ గుర్తు చేశారు.. దేశంలోని 20 రాష్ట్రాలు సేవల హక్కు చట్టాన్ని ఆమోదించాయని, అందులో పంజాబ్, హర్యానా, కర్ణాటక, న్యూఢిల్లీ తదితరాలు ఉన్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్, గోవాలలో సేవల పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయని తెలిపారు. వెంటనే తమిళనాడులోనూ సేవా హక్కు చట్టం అమలు చేయాలని కోరారు.