Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ ఒక‌టంటే... ర‌జ‌నీ ఇంకోటంటున్నారే!

By:  Tupaki Desk   |   8 April 2018 8:51 AM GMT
క‌మ‌ల్ ఒక‌టంటే... ర‌జ‌నీ ఇంకోటంటున్నారే!
X
త‌మిళ రాజకీయాలు నిజంగానే చాలా వెరైటీగా ఉంటాయ‌న్న మాట మ‌రోమారు నిజ‌మైంద‌నే చెప్పాలి. త‌మిళ‌నాడు సీఎం హోదాలో ఉన్న స‌మ‌యంలో అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత హ‌ఠాత్మ‌ర‌ణంతో ఒక్క‌సారిగా ఆ రాష్ట్ర రాజ‌కీయాలు పూర్తిగా ర‌స‌కందాయంలో ప‌డిపోయాయి. జ‌య చేతిలో ఉన్న అధికార దండాన్ని అందుకునేందుకు ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ చేసిన య‌త్నాలు... ఆమెను ఏకంగా జైలులోకి నెట్టేశాయి. ఇక జ‌య స్థానంలో సీఎం కుర్చీపై కూర్చున్న ఆమె న‌మ్మిన‌బంటు ఓ. ప‌న్నీర్ సెల్వం డిప్యూటీ సీఎంగా స‌రిపెట్టుకోగా.. శ‌శిక‌ళ న‌మ్మిన‌బంటుగా ముద్ర‌ప‌డి త‌ద‌నంత‌ర కాలంలో ఆమెకే ఏకులా మారిన ఈ. ప‌ళనిసామి సీఎంగా సెటిల్ అయిపోయారు. ఈ క్ర‌మంలో త‌దుప‌రి ఎన్నిక‌లు జ‌రిగేందుకు చాలా స‌మ‌య‌మే ఉండ‌గా... విప‌క్ష డీఎంకే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. మొత్తంగా త‌మిళ‌నాట రాజ‌కీయ శూన్యం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఈ గ్యాప్‌ లోనే త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు త‌మిళ సినీ రంగం కోలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు ప్ర‌ముఖ న‌టులు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లు రాజ‌కీయ రంగంలోకి దిగిపోయారు. ర‌జ‌నీ వ్యూహాత్మ‌కంగానే రాజ‌కీయ బ‌రిలోకి దిగిపోగా... క‌మ‌ల్ మాత్రం ఏదో అదాటుగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిప‌డ్డార‌ని చెప్పాలి. స‌రే ఒకే రంగం నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు ప్ర‌ముఖులు - అదీ కాక తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మేన‌ని చెప్పుకునే ఈ ఇద్ద‌రు న‌టులు... రాజ‌కీయాల్లో మాత్రం ఏమాత్రం పొంత‌న లేకుండానే ముందుకు సాగుతున్నారు. అయినా రాజ‌కీయాల్లో ఈ ఇద్ద‌రు నేత‌ల బాట ఉమ్మ‌డిగానే సాగుతుందా? - విడివిడిగానేనా? అన్న అనుమానాలు ఇప్ప‌టికే ప‌టాపంచ‌లు కాగా... ఇప్పుడు మ‌ళ్లీ ఈ అనుమానాలకు జీవం పోస్తున్న‌ట్లుగా వీరి కామెంట్లు ఉంటున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయినా ఈ అనుమానాలు - వాటిని ప‌టాపంచ‌లు చేసిన ఘ‌ట‌న‌లు - మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చిన అనుమానాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే... రాజ‌కీయాల్లోకి అదాటుగానే వ‌చ్చిప‌డ్డ క‌మ‌ల్ హాస‌న్‌... ఏం మాట్లాడాల‌నుకున్నా కూడా చాలా ఓపెన్‌ గానే మాట్లాడేశారు. అవినీతి పాల‌న‌ను అంత‌మొందించ‌డమే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... అందుకు అవ‌స‌మైతే ఏ ఒక్క‌రినైనా ఎదిరించేందుకు వెనుకాడ‌బోన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ర‌జ‌నీని కూడా వ్య‌తిరేకించేందుకు తాను వెనుకాడ‌బోన‌ని కూడా క‌మ‌ల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నే చేశారు. దీంతో ర‌జ‌నీతో క‌మ‌ల్ క‌లిసి సాగ‌ర‌ని తేలిపోయినట్లైంది. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు ర‌జ‌నీ వంతు వ‌చ్చింది. కమల్‌ హాసన్‌ కు వ్యతిరేకిని కానని రజనీకాంత్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. చెన్నైలో నేటి ఉద‌యం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య చేశారు. కావేరీ మేనేజ్‌ మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రంగంలోకి దిగిన తలైవా చేసిన ఈ వ్యాఖ్య‌లు... ఈ ఇద్ద‌రు న‌టులు క‌లిసే ముందుకు సాగుతారా? అన్న అనుమానాల‌ను మ‌రోమారు తెరపైకి తెచ్చాయ‌నే చెప్పాలి.