Begin typing your search above and press return to search.

కమల్ పొలిటికల్ ఎంట్రీ తేదీ ఖరారైంది

By:  Tupaki Desk   |   4 Oct 2017 5:14 PM GMT
కమల్ పొలిటికల్ ఎంట్రీ  తేదీ ఖరారైంది
X
ప్ర‌ఖ్యాత న‌టుడు క‌మ‌ల్ హ‌స‌న్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధ‌మైంది. ఇవాళ చెన్నైలో అభిమానులను కలిసిన కమల్.. తన బర్త్‌ డే లోపు ఓ ప్రణాళికను ప్రిపేర్ చేస్తున్నట్లు సంకేతాలు అందించారు. అంద‌రూ అనుకున్న విధంగానే.. భేటీలో త‌న రాజ‌కీయ ప్ర‌వేశం గురించి క‌మ‌ల్ అభిమానుల‌తో చ‌ర్చించారు. అంతేకాదు. పార్టీ జెండా, అజెండా, అలాగే పార్టీ గుర్తు ఇలా అనేక విష‌యాల‌పై అభిమాన సంఘాలకు వివ‌రించారు. త‌ద‌న‌నంత‌రం అభిమానుల అభిప్రాయాల‌ను క‌మ‌ల్ తెలుసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 7న కమల్ తన 63వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజునే కమల్ తన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని తాజా స‌మావేశం ప్ర‌కారం ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

న‌వంబ‌ర్ 7న‌ క‌మ‌ల్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా పార్టీ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో...తమిళనాడులో మరో కొత్త పార్టీ రానుంది. అంతేకాక ద‌క్షిణాదిలో మరో హీరో పొలిటికల్ పార్టీ ఆవిర్భావం జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు చాలా పార్టీలు పెట్టారు. వారందరికీ కమల్ హాసన్ తోడవుతున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ ప్రవేశం చేస్తానని గతంలో కమల్ చెప్పారు. కానీ ఇవాళ జరిగిన మీటింగ్‌తో ఆ ఫిల్మ్ స్టార్ తన పొలిటికల్ ఎంట్రీ ఖ‌రారు చేసిన‌ట్లు చెప్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా తన భావాలకు అనుగుణంగా లేన‌ట్లు కమల్ చెప్పారు. అందుకే స్వంత పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు అవినీతిమయం అయ్యాయని, రాష్ర్టాన్ని అవినీతిరహితంగా తీర్చిదిద్దేందుకు రాజకీయాల్లోకి రానున్నట్లు ఫిల్మ్ స్టార్ తెలిపారు.

కాగా, కమల్ హాసన్ కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన సంగ‌తి తెలిసిందే. రాజకీయాల్లో రాణించడానికి కేవలం సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు, పేరు ప్రఖ్యాతులు సరిపోవని - ఇంకా అంతకుమించినదేదో అవసరమని ఆయన అన్నారు. కమల్ హాసన్‌కు ఈ రహస్యం తెలిసి ఉంటుందని, రెండునెలల క్రితం అడిగి ఉంటే చెప్పేవారేమోనని ఆయన అన్నారు. తనకు నిజంగా ఆ రహస్యమేంటో తెలియదని చెప్పారు. మ‌రోవైపు ఇప్ప‌టికే కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ తో - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ తో క‌మ‌ల్ హాస‌న్ చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే.