Begin typing your search above and press return to search.

కీలక శక్తిగా కమల్ ఫ్రంట్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 AM GMT
కీలక శక్తిగా కమల్ ఫ్రంట్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు
X
తమిళనాడు పాలిటిక్స్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకే కూటమిలో లుకలుకలు.. శశికళ, రజినీకాంత్ రాజకీయ సన్యాసం.. డీఎంకే ప్రధాన పోటీదారుగా మారడంతో కమల్ హాసన్ చక్రం తిప్పుతున్నారు.

కమల్ నెలరోజులుగా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. 'మక్కల్ నీది మయ్యం'(ఎంఎన్ఎం) థర్డ్ ఫ్రంట్ కూర్పులో దాదాపు సక్సెస్ అయ్యారు. రెండు ప్రధాన కూటముల్లో అలకబూనిన వారిని మచ్చిక చేసుకోవడం ద్వారా కమల్ తమ థర్డ్ ఫ్రంట్ ను బలోపేతం చేస్తున్నారు.

మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎక్కడా తగ్గని ఫళనిస్వామి.. సీట్ల కేటాయింపులో వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఎప్పటికైనా చేటు చేస్తారనుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్ తిరస్కరించారు. ఇలా టిక్కెట్లు దక్కని వారిపుడు కమల్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరు టిటికే దినకరన్ పార్టీ ఏఎంఎంకే వైపు కూడా దృష్టి సారించారు.

ఇక తమిళనాడు రాజకీయాల్లో ఫెయిల్ అయిన విజయకాంత్, శరత్ కుమార్ లాంటి వాళ్లు కూడా కమల్ కు దగ్గరయ్యారు. శరత్ కుమార్ అయితే ఏకంగా కమల్ తో కలిసి పనిచేస్తున్నారు. చిన్నా చితక పార్టీలను కలిపి తమిళనాట థర్డ్ ఫ్రంట్ ను వీరిద్దరూ బలంగా నిలబెడుతున్నారు.తాజాగా అన్నాడీఎంకే అసంతృప్త సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కమల్ టీం రహస్య సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక కమల్ హాసన్ తాను పోటీచేయాలనుకుంటున్న నియోజకవర్గాన్ని ప్రకటించారు. దక్షిణ కోయంబత్తూర్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేతో పోత్తులో భాగంగా బీజేపీ ఈ దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ సీటును తీసుకుంది. దీంతో ఇక్కడ బలం లేని బీజేపీ పై సులభంగా గెలవవచ్చని కమల్ ఈ సీటును ఎంపిక చేసుకున్నారని సమాచారం. అదీ కాక కోయంబత్తూర్ లో ముస్లింల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందుకే కమల్ కూడా అదే సామాజికవర్గం కావడంతో గెలుపు పక్కా అనే సీటునే ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.