Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు మరో ‘‘భారీ’’ నిర్మాణ నిర్ణయం

By:  Tupaki Desk   |   3 May 2016 5:26 PM GMT
కేసీఆర్ సర్కారు మరో ‘‘భారీ’’ నిర్మాణ నిర్ణయం
X
భారీతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తానేం చేసినా.. తనదైన ముద్ర వేయటం ఆయనకు అలవాటే. ఊహించని నిర్ణయాలు తీసుకోవటం.. వాటికి భారీతనాన్ని జోడించటం కేసీఆర్ కు కొత్తేం కాదు. తనను ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా భావోద్వేగాన్ని తన నిర్ణయాన్నికి లింకేయటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. మొన్నటికి మొన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి నిర్ణయించటం తెలిసిందే. దీని ప్రత్యేకత ఏమిటంటే.. అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించి అందరి మనసుల్ని దోచుకున్నారు.

తాను చెప్పేది ఏదో మాట వరసకు కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. అంబేడ్కర్ 125 జయంతి సందర్భంగా పనుల్ని ప్రారంభించారు. తాజాగా అలాంటి తరహాలోనే మరో భారీ నిర్మాణానికి తెర తీశారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సెక్రటేరియట్ సమీపంలోని లుంబిని పార్కు వద్ద భారీ అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

అమరవీరుల సంస్మరనార్థం 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్థూపంతో పాటు.. స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ నిర్మాణానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టటనున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ తాను తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన భావోద్వేగాన్ని టీఆర్ఎస్ ఎంతగా గౌరవిస్తుందన్న భావన కలిగించేలా చేయటంతో పాటు.. ఇక్కడ నిర్మించే స్మృతివనంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు పలువురు ప్రముఖుల జీవిత చరిత్రల్ని పొందుపర్చనున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు..తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా.. అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా ఏర్పాట్లు చేయటంతో పాటు.. హుస్సేన్ సాగర్ అవతల అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఎగురువేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమైనా.. కేసీఆర్ కేసీఆరే సుమా.