Begin typing your search above and press return to search.

మోదీని వ‌దిలి.. జ‌గ‌న్‌ పై ప‌డ‌టం దేనికో?

By:  Tupaki Desk   |   5 Feb 2018 10:45 AM GMT
మోదీని వ‌దిలి.. జ‌గ‌న్‌ పై ప‌డ‌టం దేనికో?
X
ఏపీకి మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో అర‌కొర కేటాయింపుల‌తోనే స‌రిపెట్టిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు... తెలుగు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర నిర‌స‌న‌ల‌ను ఎదుర్కొంటోంది. ఏపీ ప్ర‌జ‌ల తిట్ల‌కు భ‌య‌ప‌డి ఏకంగా త‌న ఫేస్ బుక్ రివ్యూ ఆప్ష‌న్‌ నే తొల‌గించిందంటే... ఏపీ ప్ర‌జ‌ల ఆగ్ర‌హావేశాలు ఎలా ఉన్నాయో వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు. గ‌డ‌చ‌ని మూడు బ‌డ్జెట్‌ లో ఏవో కొన్ని అంశాల‌కు నిధులిస్తున్నామ‌ని చెబుతూ కాలం గ‌డిపేసిన మోదీ స‌ర్కారు... త‌న ఐదేళ్ల టెర్మ్‌లో చివ‌రి బ‌డ్జెట్‌ గా పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన తాజా బ‌డ్జెట్‌ లో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహాలు లేవ‌నే చెప్పాలి. విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీకి అన్ని ర‌కాలుగా చేయూత ఇవ్వాల్సిన కేంద్రం... విభ‌జ‌న చ‌ట్టం అమ‌లును ఇప్ప‌టికే ప‌క్క‌న‌పెటేసినా... ఓర్పుతో వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా కెలికేసింద‌నే చెప్పాలి. అయితే ఈ త‌ర‌హా కేంద్రం వైఖరిపై ఏపీలో విప‌క్షంగా ఉన్న వైసీపీతో పాటు కాంగ్రెస్‌- వామ‌ప‌క్షాలు కూడా పెద్ద ఎత్తునే నిర‌స‌న గ‌ళాలు విప్పాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు స‌భ‌లో త‌న‌దైన శైలిలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

అయితే ఏపీలో అధికార పార్టీ హోదాలో ఉన్న టీడీపీ మాత్రం... కేంద్ర ప్ర‌భుత్వం అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై నిర‌స‌న తెలిపేందుకు మీన‌మేషాలు లెక్కిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేస్తున్న మోదీ స‌ర్కారులో తాను భాగ‌స్వామిగా ఉన్నా... ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌న్న విష‌యాన్ని కూడా టీడీపీ మ‌రిచిపోయింద‌న్న రీతిలోనూ ఆయా పార్టీలు - ప్రజా సంఘాలు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. మూడు రోజుల పాటు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు విడ‌త‌ల‌వారీగా నిర్వ‌హించిన చ‌ర్చ‌ల ఫ‌లితంగా మోదీ స‌ర్కారుపై నిర‌స‌న గ‌ళం విప్పాల్సిందేన‌ని టీడీపీ పార్ల‌మెంటరీ పార్టీ భేటీ తీర్మానించింది. అది కూడా మోదీ స‌ర్కారుకు నొప్పి క‌ల‌గ‌కూడ‌ద‌న్న రీతిలోనే నిర‌స‌న ఉండాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో మీడియా ముందుకు వ‌స్తున్న ప్ర‌తి టీడీపీ నేత‌ల అసలు విష‌యాన్ని మ‌రిచిపోయిన అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నార‌న్న కొత్త వాద‌న ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది.

ఈ వాద‌న ప్ర‌కారం ఏపీకి అన్యాయం చేసిన వారిపై దాడి చేయాల్సిన టీడీపీ... ఆ విష‌యాన్ని అంత‌గా ప్ర‌స్తావించ‌కుండానే... కేంద్ర బ‌డ్జెట్‌ తో ఏమాత్రం సంబంధం లేని విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడికి దిగుతున్నార‌ట‌. కాసేప‌టి క్రితం టీడీపీ వాణిని వినిపించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్య‌వ‌హారం చూస్తే... ఈ వాద‌న స‌రైన‌దేనన్న విశ్లేష‌ణ సాగుతోంది. అయినా ఏపీకి నిధులు కేటాయించ‌కుండా స‌తాయిస్తున్న మోదీ స‌ర్కారును విడిచిపెట్టి... ఏపీకి నిధులివ్వండ‌ని జగ‌న్ ఎందుకు అడ‌గ‌ట్లేద‌ని కాల్వ ప్రశ్నించారు. ఎన్డీఏ స‌ర్కారులో కీల‌క భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న టీడీపీ... మోదీ స‌ర్కారులో ఇద్ద‌రు మంత్రుల‌ను క‌లిగిన టీడీపీ తన‌కు తాను స్వ‌యంగా అడిగి... ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటం చేసి నిధులు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే దానిని విస్మ‌రించేసిన టీడీపీ... వ్యూహాత్మ‌కంగానే జ‌గ‌న్‌ ను టార్గెట్ చేస్తూ... విప‌క్ష నేత‌పై విమ‌ర్శ‌లు చేస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా చూస్తే... అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే టీడీపీ వ్యూహం ర‌చించిందా? అన్న కొత్త ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర మీద‌కు వ‌స్తున్నాయి. మ‌రి ఈ విష‌యాలు టీడీపీ నేత‌ల‌కు ఎప్పుడు అర్థ‌మ‌వుతాయోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. వెర‌సి టీడీపీ వ్యూహం గ‌తి త‌ప్పిన రీతిలో ముందుకు సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి.