Begin typing your search above and press return to search.

కాళోజీని గౌర‌వించారా? అవ‌మానించారా?

By:  Tupaki Desk   |   9 Sep 2015 4:44 PM GMT
కాళోజీని గౌర‌వించారా? అవ‌మానించారా?
X
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల తొమ్మిదిన జరపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర యువజన సర్వీసులు - పర్యాటక - సాంస్కృతిక శాఖ జీవో జారీ చేసింది. అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సాహితీ - సమాలోచనలు - కాళోజీ జీవితం - సాహిత్యం - కవిత్వంపై చర్చలు - ఉపన్యాసాలు - కవి సమ్మేళనాలు - వ్యాసరచన కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించింది. తెలంగాణలో భాష - నవల - నాటకం - కథ - కవితా రచనలపై రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించాలని సూచించింది.

అయితే ప్రజానాయకుడు, సామాజిక రచయిత అయిన‌ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశించిన ప్ర‌భుత్వం ఆయ‌న్ను పూర్తి స్థాయిలో గౌర‌వించిన‌ట్లేనా? సీఎం కేసీఆర్ హోదాలో కేసీఆర్ గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌నల సంగ‌తి ఏంటి అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కాళోజీ శత జయంతి సందర్భంగా 2014 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండలో కాళోజీ కళా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 కోట్ల రూపాయల ఖర్చుతో మూడున్నర ఎకరాల్లో భవనం నిర్మిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతికి దీటుగా ఆరునెలల్లో భవన నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 30 కోట్ల రూపాయలకు పెంచారు. కానీ, ఈనాటికీ ఈ భవన సముదాయం నిర్మాణం ప్రారంభం కాలేదు. ఆనాడు కేసీఆర్ హడావుడిగా వేసిన శిలాఫలకం నాయకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ఎండకు ఎండుతూ, వానకు నడుస్తూ శంకుస్థాపన రాయి మూగగా రోదిస్తోంది.

తెలంగాణ భాష, నుడికారానికి కొత్త అర్థం చూపిన మహా రచయిత కాళోజీని ప్ర‌భుత్వం భాషా దినోత్స‌వంగా నిర్వ‌హించ‌డం స‌మ‌ర్థ‌నీయ‌మే అయిన‌ప్ప‌టికీ.... ముఖ్య‌మంత్రి స్థాయిలో ఇచ్చిన హామీలు ఆ విధంగా నామ‌మాత్రం అయిపోవ‌డం బాధాక‌ర‌మే.​