Begin typing your search above and press return to search.

కలియుగ దైవం వెయిటింగ్... తెర తీయగరాదా... ?

By:  Tupaki Desk   |   11 Feb 2022 8:30 AM GMT
కలియుగ దైవం వెయిటింగ్... తెర తీయగరాదా... ?
X
ఏడు కొండల వాడు, కలియుగ దైవం. భక్తులకు కొంగు బంగారం. అలాంటి భగవంతుడు ఇపుడు తెర చాటున ఉన్నారు. భక్తులకు తన దీవెనలు ఇవ్వడానికి కూడా వీలు లేకుండా ఉన్నాడు. అవును విశాఖలో రుషికొండ వద్ద టీటీడీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెంకన్న ఆలయం ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. ఈ ఆలయాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా ఓపెన్ చేయించాలని వైసీపీ నేతల కోరిక.

కానీ ఏ కారణం చేతనో వాయిదా పడుతూ వస్తోంది. జగన్ విశాఖ వచ్చిన ప్రతీసారీ షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్స్ లోనే పాలుపంచుకుంటున్నారు. ఆ మీదట ఆయన వెళ్లిపోతున్నారు. మరి స్వామి వారి ఆలయం ప్రారంభం ఎపుడు అని ఆస్థిక జనులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ సాగర తీరంలో రుషికొండ వద్ద అద్భుతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని టీటీడీ నిధులతో నిర్మించారు.

ఏనాడో ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినా ముఖ్యమంత్రి చేతులో మీదుగా ప్రారంభించాలన్న ఒకే ఒక్క కారణంతో ఇప్పటికీ తెర తీయడంలేదు. దాంతో స్వామి అలా తెర వెనక వేచి చూడాల్సి వస్తోంది. దీంతో భక్తులు అంతా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి ఎన్ని పనులు ఉన్నా ఇంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు తీరిక లేదా అన్న ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

నిజానికి శ్రీవారి ఆలయ నమూనాతో ఇక్కడ దీన్ని నిర్మించారు. దాంతో ఈ ఆలయం కనుక ప్రారంభమైతే మరో తిరుమల కొండగా ఈ ప్రాంతం మారుతుంది అంటున్నారు. జగన్ లో భక్తి ఎక్కువ అని అందరికీ తెలుసు. ఆయన పీఠాలను మఠాలను తరచూ సందర్శిస్తున్నారు. అలాగే స్వామీజీల దర్శనం కూడా చేసుకుంటున్నారు. అదే టైమ్ లో సకల లోకాలకు దేవ దేవుడు అయిన వెంకన్న స్వామి వారి ఆలయ ప్రారంభం కూడా చేస్తే బాగుంటుంది కదా అన్నదే అందరి ఆవేదన.

దీని మీద బీజేపీ అయితే ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. వైసీపీ సర్కార్ కి పది రోజుల టైమ్ ఇస్తున్నామని, ఈ లోగా వెంకన్న ఆలయాన్ని ప్రారంభించకపోతే తామే దాన్ని ప్రారంభించేస్తామని కూడా ఆ పార్టీ చెబుతోంది. జగన్ విశాఖకు తరచూ వస్తున్నారు కానీ ఆలయ ప్రారంభానికి తీరిక లేదా అని మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా నిలదీస్తున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక సేవలో జగన్ తరిస్తున్నారు. హిందూత్వ మీద తన విశ్వాసాన్ని చాటుకుంటున్నారు.

ఈ సమయంలో బీజేపీ మాత్రం జగన్ ని మరో కోణం నుంచి కార్నర్ చేస్తోంది. ఏకంగా కలియుగ వైకుంఠ నాధుడినే వేచి ఉండేలా చేయడమేంటి అని గుస్సా అవుతోంది. మరి ఈసారి టూర్ లో జగన్ కనుక ఆలయాన్ని ప్రారంభించకపోతే బీజేపీ లేవనెత్తే భక్తి ఉద్యమ సెగలు ఆ పార్టీని తాకడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.