Begin typing your search above and press return to search.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఘోరం జ‌రిగిపోయింది!

By:  Tupaki Desk   |   20 Sep 2017 2:51 PM GMT
కాళేశ్వరం ప్రాజెక్టులో ఘోరం జ‌రిగిపోయింది!
X
తెలంగాణ స‌ర్కారు అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. శ‌ర‌వేగంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు ప‌నుల్లో భాగంగా నేటి మ‌ధ్యాహ్నం దాటిన త‌ర్వాత ఉరుము లేని పిడుగులా పెద్ద పేలుడే సంభ‌వించింది. ప్రాజెక్టు ట‌న్నెల్‌లో చోటుచేసుకున్న పేలుడు కార‌ణంగా ఏడుగురు కూలీలు దుర్మ‌ర‌ణం చెంద‌గా... మ‌రో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. వీరిలోనూ ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఊహించ‌ని విధంగా జ‌రిగిన ఈ ప్ర‌మాదం అక్క‌డి ప్రాజెక్టు ఇంజినీర్ల‌తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను కూడా తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింద‌నే చెప్పాలి.

ఇక ప్రాజెక్టులో జ‌రిగిన ప్ర‌మాదం వివ‌రాల్లోకెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్‌ మార్గంలో బుధవారం పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ప్రాణహిత-చేవేళ్ల 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనుల వద్ద ఎయిర్ బ్లాస్టింగ్ కార‌ణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వేగంగా స్పందించిన సహాయక బృందాలు హుటాహుటీన ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని క్షతగాత్రులను స‌మీపంలోని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇక ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి విష‌యానికి వ‌స్తే... ప్రాజెక్టు ప‌నుల్లో కూలీలుగా ప‌నిచేసేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన వారు చాలా మంది తెలంగాణ‌కు వ‌చ్చారు. ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న ప‌లు చోట్ల వీరు ప‌నిలో కుదురుకున్నారు. ఈ క్ర‌మంలో తిప్పాపూర్ వ‌ద్ద కొన‌సాగుతున్న కాళేశ్వ‌రం ట‌న్నెల్ ప‌నుల్లోనూ యూపీకి చెందిన కూలీలే అధికంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ట‌న్నెల్‌లో ఆ రాష్ట్రానికి చెందిన కూలీలు... ప‌నిలో నిమ‌గ్న‌మై ఉండ‌గా పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు కూలీలు చ‌నిపోయారు. మ‌రో న‌లుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు.

వెంట‌నే స్పందించిన అధికారులు క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా... చికిత్స ప్రారంభించిన కాసేప‌టికే మ‌రో కూలీ మృత్యుత‌వాప‌డ్డాడు. దీంతో చ‌నిపోయిన కూలీల సంఖ్య ఏడుకు చేరుకుంది. మ‌రోవైపు తీవ్ర గాయాల‌పాలైన ముగ్గురిలోనూ ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప‌నులు వేగంగా జ‌రుగుతున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టును వీల‌యినంత త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం త‌ల‌పోస్తున్న త‌రుణంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.