Begin typing your search above and press return to search.

టీడీపీలో చేరికలపై సీనియర్ నేత మనోభావం

By:  Tupaki Desk   |   4 March 2016 9:43 AM GMT
టీడీపీలో చేరికలపై సీనియర్ నేత మనోభావం
X
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుండడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి చేర్చుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. అదేంకాదు... వైసీపీలో ఉండలేక.. టీడీపీ అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై వారు వస్తున్నారని టీడీపీ అంటోంది. ప్రస్తుత రాజకీయాల్లో అందరూ ముదుర్లే కాబట్టి ఎవరి మాటనూ నమ్మలేని పరిస్థితి. నూటికి 99 మంది స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసేవారుగానే ముద్రపడిన నేతలు కావడంతో ఏ ఒక్కరి వాదననూ విశ్వసించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్ గా - వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేకు తండ్రిగా ఓ నేత మనసులో మాట ఇది...

1978లో గౌతు లచ్చన్న - వెంకయ్యనాయుడు - చంద్రబాబునాయుడు - రాజశేఖరరెడ్డి - జైపాల్ రెడ్డి.... ఇలా హేమాహేమీలతో కలిసి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ పిలుపుతో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి 1989 - 94 - 99 - 2004 వరకు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన పేరు కలమట మోహనరావు... పాతపట్నం మాజీ ఎమ్మెల్యే. నిరాడంబరుడు.. మందీమార్బలం - హడావిడి ఉండదు. చాలా సాదాసీదాగా కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తుండడం ఆయన పని. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి అంతాఇంతా కాదు. గిరిజన ప్రాంతాల్లో కొండల్లోగుట్టల్లో ఉన్న ఊళ్లకు రహదారులు వేయించడం, వాగులపై చిన్నచిన్న వంతెనల నిర్మాణం వంటివాటితో బాగా పేరు తెచ్చుకున్న నేత. నిరాడంబరుడు - అవినీతికి దూరంగా ఉంటారన్న కారణంతో ఎన్టీఆర్ కూడా ఆయనంటే ఇష్టపడేవారు. అయితే... అనుకోని పరిస్థితుల్లో ఆయన తనయుడు కలమట వెంకటరమణతో కలిసి వైసీపీలో చేరారు. చేరినా... కూడా ఆయన వైసీపీ నుంచి పోటీ చేయలేదు.. తనయుడు రమణ పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు తాజాగా రమణ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన తాము ఎందుకు మళ్లీ టీడీపీలోకి వచ్చామన్నది వివరించారు.

తమను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి చూసి ఆయనకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాము టీడీపీలోకి వచ్చామని చెప్పారు. సరిహద్దుల్లో, గిరిజన ప్రాంతాలున్న తమలాంటి నియోజకవర్గాల అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని... కరకట్టలు - రోడ్లు నిర్మించడానికి ఏమాత్రం సహకరించడం లేదని.. మంచి నీటి సౌకర్యం మెరుగుపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదని... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ సమస్యల పరిష్కారానికి తాను కృషిచేశానని... తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రం తమ నియోజకవర్గానికి నిధులు అంది ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యలు తీర్చడానికి అవకాశం ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే మళ్లీ తమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి టీడీపీ మాత్రమే తోడ్పడుతుందన్న గత అనుభవంతో మళ్లీ పార్టీలోకి వచ్చామని.. అంతేకానీ, చంద్రబాబు తమకు ప్రలోభాలు పెట్టలేదని, తాము కూడా ప్రలోభాలకు ఆశపడేవాళ్లం కామని సీనియర్ నేత కలమట మోహనరావు చెప్పుకొచ్చారు.

... పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన తండ్రి మోహనరావు మాట్లాడిన మాటలు విని చాలామందికి ఒక విషయం చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ది టీడీపీతో సాధ్యమనే నమ్మకంతోనే ఎమ్మెల్యేలు చేరుతున్నారని... ఇతర ప్రలోభాలేవీ లేవని అర్థమవుతోందని అంటున్నారు. కలమట మోహనరావు నిస్వార్థపరుడని... అలాంటి వ్యక్తులు సహజంగా మోసకారి మాటలు - అబద్ధాలు చెప్పరు కాబట్టి మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ చాలావరకు ఇలాంటి కారణాలే ఉంటాయని భావిస్తున్నారు.