Begin typing your search above and press return to search.

లోక్‌ సభను ఆలోచనలో పడేసిన లేడీ డాక్టర్ ప్రసంగం!

By:  Tupaki Desk   |   31 July 2019 7:44 AM GMT
లోక్‌ సభను ఆలోచనలో పడేసిన లేడీ డాక్టర్ ప్రసంగం!
X
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్ ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌ సభ రెండు రోజుల కిందట ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ - అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షను పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఈ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు డాక్టర్ కకోలీ ఘోష్ దస్తీదార్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. స్వయంగా వైద్యురాలైన ఆమె ప్రస్తుత వైద్యవ్యవస్థలోని లోపాలు.. ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వంటి అన్ని అంశాలనూ స్పృశిస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది.

‘సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలోని వైద్యవ్యవస్థ మొత్తాన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమే ఈ మెడికల్ కౌన్సిల్ బిల్లు.

దేశంలో ఆరోగ్య రంగం చాలాకాలంగా నిరాదరణకు గురవుతూనే ఉంది. ఆరోగ్య రంగానికి మన కేంద్ర బడ్జెట్లో 2 శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తున్నాం.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి కేవలం 10 లక్షల మంది వైద్యులున్నారు. డాక్టర్లు చాలా ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే వైద్య కళాశాలలు - వైద్య విద్యా బోధకులు - నిధులు ఇంకా కావాలి. ఇవన్నీ చేయడానికి బదులు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌‌ ను పెంచుకుంటూ పోతున్నాం. ఇలాంటివారిలో 57 శాతం మందికి సరైన అర్హతలు లేవు. వారిలో మూడోవంతు మంది కనీసం ఇంటర్మీడియట్ కూడా పాస్ కాకుండానే ఈ వృత్తిలోకి వచ్చేస్తున్నారు. నొప్పేస్తే ఐబూప్రూఫిన్ మాత్ర ఇవ్వాలనే వారికి తెలుసు.. కానీ, దాని వల్ల వచ్చే రియాక్షన్స్ ఏమిటి? అది ఎలాంటి పర్యవసానాలకు దారి తీస్తుందన్నది తెలియదు. ఇలాంటివారందరినీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ పేరుతో వైద్య వ్యవస్థలోకి తెచ్చి ప్రజల ప్రాణాలకు ప్రమాదం తెస్తున్నారు.

ఆర్నెళ్ల కోర్సుతో వైద్యం చేసేయగలిగితే ఇక నాలుగైదేళ్ల కోర్సులెందుకు? ఇంటర్మీయట్ తరువాత ఆర్నెళ్ల కోర్సు చదివేసి వైద్యం మొదలుపెట్టి ప్రజలు ప్రాణాలు తీసి జనాభా తగ్గించేస్తారా.. ఇది ఎంతమాత్రం సహించరానిది.

మరిన్ని వైద్య సీట్లు - బోధకులు - పరికరాలు - వసతుల కోసం నిధులు కేటాయించాలి. ప్రపంచంలో వస్తున్న నూతన వైద్య విధానాలూ మనమూ అందిపుచ్చుకునేలా రీసెర్చిని ప్రోత్సహించాలి. సకాలంలో వైద్యం అందించగలిగితే మృత్యువు వరకు వెళ్లినవారిని కూడా బతికించే అవకాశం ఉంటుంది. నా అనుభవంలో ఇది ఎన్నోసార్లు జరిగింది. వైద్యం అందరికీ చేరువ కావాలి. దేశంలోని చిట్టచివరి గ్రామంలోని చిట్టచివరి మనిషికి కూడా వైద్యం అందే రోజు రావాలి’’ అంటూ ఆమె వ్యవస్థను ఎండగడుతూ భావోద్వేగంతో మాట్లాడారు.

కాగా ఈ బిట్లును వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) పిలుపు మేరకు ప్రైవేటు వైద్యులంతా ఒక రోజు బంద్‌ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా నేడు ప్రైవేటు వైద్యశాలలన్నీ మూతపడనున్నాయి.