Begin typing your search above and press return to search.

షర్మిల ఏపీ సీఎం... ఎలాగో చెప్పిన బీయారెస్ సీనియర్ నేత

By:  Tupaki Desk   |   7 Feb 2023 10:27 PM GMT
షర్మిల ఏపీ సీఎం... ఎలాగో చెప్పిన బీయారెస్ సీనియర్ నేత
X
ఏపీకి జగన్ సీఎం అని అందరికీ తెలుసు. ఆయన మరో సారి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. దాని కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. సరే ఏపీలో పోటీ చూస్తే గట్టిగానే ఉంది. ఈ దఫా తమకు తప్పక చాన్స్ లభిస్తుందని చంద్రబాబు ఆశపడుతున్నారు. జనసేన కూడా గట్టిగా ఊపితే అధికారంలో వాటా తీసుకుని తానూ సీఎం కావచ్చు అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు.

ఇలా ఏపీ రాజకీయం ఉంటే ఇపుడు సడెన్ గా షర్మిల ఏపీ సీఎం అని అంటున్నాడొక సీనియర్. అది కూడా ఏపీకి సంబంధం లేని నాయకుడు. అయితే ఆయన ఏమీ ఆషామాషీగా ఈ మాటలు అనడంలేదు అని అంటున్నారు. ఆయన ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన వారు. ఆయనే కడియం శ్రీహరి. ఆయన తెలంగాణాలో పార్టీ పెట్టుకుని బీయారెస్ నేతలను ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్ షర్మిల మీద ఫైర్ అవుతూ ఈ కామెంట్స్ చేశారు.

అదే టైం లో ఏపీలో రాజకీయాన్ని కూడా ఆయన విశ్లేషించి అక్కడ పాదయాత్ర చేస్తే సీఎం సీటు గ్యారంటీ అని కూడా జోస్యం చెప్పారు. ఈ నేపధ్యంలో కడియం చెప్పిన కొన్ని విషయాలు చూస్తే సంచలంగానే ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ జైలుకు వెళ్తే అక్కడ సీఎం సీటు ఖాళీ అవుతుంది అన్నట్లుగా కడియం మాట్లాడారు. జగన్ ఎందుకు జైలుకు వెళ్తారు అంటే తన మీద ఉన్న సీబీఐ కేసులు ఒక కొలిక్కి వస్తే ఆయన జైలుకు వెళ్తారన్నది కడియం ఒక వాదన. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా జగన్ జైలుకు వెళ్లవచ్చు అంటూ కడియం చెప్పడమే అసలైన సంచలనం.

ఈ విషయంలో ఇప్పటిదాకా ఏపీలోని విపక్షాలు సైతం జగన్ జైలుకు వెళ్తారు అని మాట అనలేదు. కానీ కడియం డేరింగ్ అండ్ డేషింగ్ గా ఈ మాటలు వాడేశారు అని అంటున్నారు. మరి ఆయనకు ఈ కేసు మీద ఉన్న అవగాహన ఏంటో ఆయనకు ఉన్న అంచనాలు ఏంటో అన్నది చూడాలని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ గ్రాఫ్ ఏపీలో దారుణంగా పడిపోయింది అని కడియం సర్వే ఫలితాలను చెప్పడమూ ఆశ్చర్యపరచేదే.

అంటే ఏపీ మీద కడియం బాగానే స్టడీ చేస్తున్నట్లుగా ఉన్నారని అర్ధమవుతోంది. అంతే కాదు ఏపీలో మారుతున్న రాజకీయాన్ని ఆయన అధ్యయనం చేస్తున్నారు అని అంటున్నారు. ఎంతైనా కడియం ఒకనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా. ఆయన మిత్రులు కూడా ఏపీలో ఉన్నారు. అలా ఆయనకు చాలా విషయాలే తెలిసి ఉంటాయని అంటున్నారు.

ఇక జగన్ జైలు కి వెళ్తే ఏపీ సీఎం పదవి నీకే అంటూ చెల్లెమ్మ షర్మిలను ఉసిగొల్పడంలోనే కడియం మార్క్ పాలిటిక్స్ ఉందని అంటున్నారు. షర్మిల ఎంత నడచినా తెలంగాణాలో ఓట్లు పడవని, వైఎస్సార్ కుటుంబమే తెలంగాణాకు యాంటీ అని ఆయన గట్టిగా చెప్పేశారు. షర్మిల సమైక్యాంధ్రా అంటూ ఉమ్మడి ఏపీలో ప్రచార్మ చేశారని, జగన్ పార్లమెంట్ లో సమైక్యాంధ్రా అని ప్లే కార్డులు ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణా అంటే వ్యతిరేకత ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీని జనాలు ఎలా ఆదరిస్తారు అని ఆయన ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నను సంధించారు.

మొత్తానికి షర్మిలను గట్టిగా విమర్శిస్తూనే రాజకీయ దారి కూడా చెప్పడమే కడియం ప్రత్యేకత అంటున్నారు. కడియం చెప్పిన విషయాలు చేసిన విమర్శల మీద షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఒక విషయం అయితే ఏపీలోని వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. మొత్తానికి చెల్లెమ్మ రాజకీయం కాదు కానీ జగన్ మీద బీయారెస్ నేతలు చేస్తున్న విమర్శలు ఏపీలోని వైసీపీ నేతలు ఎలా జీర్ణించుకుంటారో చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.