Begin typing your search above and press return to search.

`ద‌ళిత బంధు`పై క‌డియం హాట్ కామెంట్స్‌.. ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   15 Aug 2021 9:30 AM GMT
`ద‌ళిత బంధు`పై  క‌డియం హాట్ కామెంట్స్‌.. ఏమ‌న్నారంటే
X
తెలంగాణ మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ద‌ళిత నాయ‌కుడు.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ క‌డియం శ్రీహ‌రి.. ఆస‌క్తిక ర కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌బుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ద‌ళిత బంధు ప‌థకంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. న‌ర్మ‌గ‌ర్భంగా ఉన్నాయి. ఈ ప‌థ‌కం కింద‌.. ద‌ళిత కుటుంబాల్లో అత్యంత పేద‌రికాన్ని అనుభ‌విస్తున్న ద‌ళితుల‌కు.. ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఒకే విడ‌త చెల్లిస్తుంది. ఇది.. వారి జీవితాల ను బాగు చేస్తుంద‌ని.. వ్యాపారం.. లేదాస్వ‌యం ఉపాధి ప్రారంభించేందుకు, కుటుంబానికి ఆర్థిక ద‌న్నుగా నిలుస్తుంద‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే.. దీనిపై విప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ద‌ళితుల‌కు 10 ల‌క్ష‌లు కాదు.. 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని.. బీజేపీ అంటుండ‌గా.. ఈ ప‌థ‌కాన్ని పూర్తిగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని.. కాంగ్రెస్ పార్టీ అంటున్నాయి. ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఎవ‌రూ కూడా నోరెత్త‌లేదు. కానీ, తాజాగా డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి.. ద‌ళిత బంధు ప‌థ‌కంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల అంత‌రార్థం.. మ‌రో విధంగా ఉంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. కడియం శ్రీహరి జనగామ జిల్లాలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే.. ప్ర‌భుత్వంపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. దళిత బంధు అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది త‌మ పార్టీ(టీఆర్ ఎస్‌)నే అని వ్యాఖ్యానించారు. ఈ విష‌యం త‌మ‌కు బాగా తెలుసున‌న్నారు. అదేస‌మ‌యంలో దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి టీఆర్ ఎస్‌కు వ‌చ్చింద‌ని తెలిపారు. ఒక వేళ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లులో విఫ‌ల‌మైతే.. ఎన్నికల్లో ఘోరమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

“ఇవన్నీ తెలిసే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే దళిత బంధు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద వర్గాలైన దళితుల జీవన ప్రమాణాలు మెరుపర్చేందుకే దళిత బంధు. ఏడేళ్లుగా ఎమీ చేయకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల స‌మ‌యంలో ఏదో చేస్తున్నామ‌నే విప‌క్షాల ప్ర‌చారం స‌రైంది కాదు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయరనే విమర్శలు సరికాదు. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు మేము సింహం మీద కూర్చిని సవారీ చేస్తున్నామని.. గతంలో నీటిపారుదల రంగానికి ఎలా పెద్దపీట వేశారో ఇప్పుడు దళితుల అభ్యున్నతికి కూడా అలాగే పెద్దపీట వేస్తాం” అని శ్రీహరి వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి టీఆర్ ఎస్ రెండో ద‌ఫా అధికారం చేప‌ట్టాక‌.. సీఎం కేసీఆర్‌.. క‌డియంను ప‌క్క‌న పెట్టారు. గ‌తంలో టీడీపీ నుంచి వ‌చ్చి టీఆర్ ఎస్‌ల‌లో చేరిన ఆయ‌నకు ఏకంగా.. డిప్యూటీ సీఎంప‌ద‌విని ఇచ్చిన విష‌యం తెలిసిందే. కానీ, రెండో ద‌ఫా అధికారం ద‌క్కిన త‌ర్వాత‌.. క‌డియంకు ఎలాంటి ప్రాధాన్యతా లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్లుగా ఆయ‌న కేసీఆర్ వైఖ‌రిపై గుస్సాగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు క‌డియం చేసిన వ్యాఖ్య‌ల అంత‌రార్థం.. ప్ర‌భుత్వాన్ని సంక‌టంలోకి నెట్టేలా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు ప‌రిశీల‌కులు.