Begin typing your search above and press return to search.

బాబు - బాలకృష్ణల మధ్య టికెట్‌ వార్‌..!

By:  Tupaki Desk   |   7 March 2019 4:38 AM GMT
బాబు - బాలకృష్ణల మధ్య టికెట్‌ వార్‌..!
X
ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు తన పోరాటాన్ని వేగవంతం చేస్తున్నారు. అయితే ఆయన పోరాటం చేస్తున్నది ప్రతిపక్ష నేతలపై కాదు. సొంత పార్టీ నేతలతోనేనంటున్నారు స్థానికులు. ప్రకాశం జిల్లాలో బలంగా ఉనికిని నాటుకున్న ఉగ్ర నరసింహారెడ్డి 2014 తరువాత రాజకీయంగా యాక్టివ్‌ గా లేరు. ప్రస్తుతం ఆయన సైకెలెక్కేశారు. చంద్రబాబుకు జై కొట్టారు. దీంతో కనిగిరి టికెట్‌పై రేసు ఊపందుకుంది. ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరగానే కనిగిరి టిక్కెట్‌ పై కన్నేశారట. ఇటు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబురావుకు పార్టీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఈ సీటు ఫైట్ మొదలైంది.

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కదిరి బాబు - ఉగ్ర నరసింహారెడ్డిల మధ్య నిత్యం రాజకీయ పోరు సాగుతోంది. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా వివాదాలకు పోకుండా కలిసి పనిచేయాలని టీడీపీ అధినేత సూచించారట. దీంతో తమ నేతకు టిక్కెట్‌ వస్తుందా..? రాదా..? అనే ఆందోళనలో కదిరి అనుచరవర్గంలో మొదలైందట. అటువైపు చంద్రబాబు కనిగిరి టికెట్‌ ఇస్తారనడంతోనే ఉగ్రనరసింహారెడ్డి పార్టీలో చేరారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి క్లారిటీ ఇవ్వనందున ఉగ్ర నరసింహారెడ్డికే టికెట్‌ కన్ఫామ్‌ అని నరసింహారెడ్డి వర్గం చెబుతోందట.

అయితే ఈ సీన్‌ లోకి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు ఎంట్రీ ఇచ్చారని తెలిసింది. కనిగిరి ఎమ్మెల్యే ప్రస్తుతం బాలకృష్ణపైనే ఆశలు పెట్టుకున్నారట. అయితే కదిరి బాబురావు - బాలకృష్ణపై భరోసా పెట్టుకోవడానికి గల కారణమేంటనే ప్రచారం జోరుగా సాగుతోందట.

నందమూరి బలకృష్ణ - బాబురావు మంచి మిత్రులట. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ ఆశీస్సులతోనే బాబురావు టికెట్‌ పొంది విజయం సాధించారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ తనకు అండగా నిలబడుతారని బాబురావు ఆశిస్తున్నారట. అయితే చంద్రబాబు బాబురావు పట్ల సుముఖంగా లేరని - అందుకే ఆయన టికెట్‌ పై క్లారిటీ ఇవ్వడం లేదని కొందరు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. దీంతో చంద్రబాబు... ఉగ్ర నరసింహారెడ్డి వైపే మొగ్గు చూపుతారా..? లేక బావమరిది బాలయ్య సపోర్టు చేస్తున్న కదిరి బాబురావుకు టికెట్‌ ఇస్తారా అన్నది సస్పెన్స్‌ గా మారింది.

ఈ నేపథ్యంలో బాబు కొత్త ఆలోచన చేసినట్లు సమాచారం. ఉగ్ర నరసింహారెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడానికి ప్లాన్‌ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.. అయితే దీనికి నరసింహారెడ్డి ఒప్పుకోలేదట. దీంతో వీరిద్దరిని కాదని మూడో వ్యక్తిని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బాబు చేస్తున్నట్లు సమాచారం. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎంఎం కోండయ్య ఆ తరువాత వైసీపీలో చేరారు. ఇప్పుడు కొండయ్యను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి కనిగిరి టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాడట. అయితే కొండయ్యకు కదిరి బాబురావు - ఉగ్ర నరసింహారెడ్డి ఇద్దరూ సహకరించే పరిస్థితి లేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. దీంతో కనిగిరి ఫైట్ బావ - బావమరుదులు బాబు - బాలయ్య మధ్య చిచ్చు పెట్టేలానే ఉందని చర్చ నడుస్తోంది.