Begin typing your search above and press return to search.

బాలకృష్ణ అమాయకుడు.. ఆయన మాటకు విలువే లేదు

By:  Tupaki Desk   |   10 March 2020 12:53 PM GMT
బాలకృష్ణ అమాయకుడు.. ఆయన మాటకు విలువే లేదు
X
కనిగిరి మాజీ ఎమ్మెల్యే , నందమూరి బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబూరావు మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా.. బాబూరావు గత అసెంబ్లీ ఎన్నికల నుంచే టీడీపీ అధినేత చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఆయన్ని, 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. కనిగిరి నుండి మరొకరికి అవకాశం కల్పించారు.

దీనిపై బాబూరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. కనిగిరి సీటు మళ్లీ తనకే ఇవ్వాలని బాబూరావు టీడీపీకి అప్పట్లో స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేస్తూ, బాలయ్య ద్వారా అధిష్టానం పై ఒత్తిడి పెంచారు. అయితే , ఈ నిర్ణయం పై బాబు వెనక్కి తగ్గకపోవడంతో దర్శి నుంచి పోటీ చేసిన బాబూరావు.. వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇది టీడీపీకి, బాలయ్యకి పెద్ద షాక్ అని చెప్పాలి.

ఇక ఈయన వైసీపీలో జాయిన్ అయిన తరువాత మీడియా తో మాట్లాడుతూ ... మోసానికి కేరాఫ్ చంద్రబాబు అని , నమ్మకం ద్రోహం చేయడంలో చంద్రబాబుని మించిన మొనగాడే లేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.ఏవో పదవులు ఆశించి వైసీపీలోకి తాను వెళ్ల లేదని, చంద్రబాబు లాంటి ద్రోహి దగ్గర ఉండకూడదనే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే మడమతిప్పని నాయకుడు అని అన్నారు. సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం తనకు చెప్పకుండా దర్శికి పంపి.. బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేయించారని గుర్తుచేశారు. అలాగే, ఇన్ని రోజులు టీడీపీ లో కొనసాగడానికి కారణం బాలకృష్ణనే కారణం అని , అయన చాలామంచి వ్యక్తి అని చెప్పుకొచ్చారు.