Begin typing your search above and press return to search.

క‌డ‌ప టీడీపీ ఫుల్ సైలెంట్‌.. ఈ స్టోరీ తెలుసా?

By:  Tupaki Desk   |   15 Jan 2021 5:30 PM GMT
క‌డ‌ప టీడీపీ ఫుల్ సైలెంట్‌.. ఈ స్టోరీ తెలుసా?
X
క‌డ‌ప‌. ఈ పేరు త‌లుచుకుంటేనే టీడీపీ నేత‌ల ఆలోచ‌న‌లు ఎక్క‌డికో వెళ్తాయి. అంతేకాదు.. వెంట‌నే రోమాలు నిక్క‌బొడుచుకుం టాయి. నోటి నుంచి మాట‌ల ప‌రంప‌ర, ల‌క్ష్యాల ప‌రంప‌ర దూసుకువ‌చ్చేస్తాయి. ``జ‌గ‌న్‌కు త‌గిన బుద్ధి చెబుతాం. క‌డ‌ప‌లో పాగా వేస్తాం`` అని రాయ‌ల‌సీమ‌ టీడీపీ నాయ‌కుల్లో అన‌నివారు ఉండ‌రు. అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రింత రెచ్చిపోయి.. క‌డ‌ప‌లో టీడీపీ పాగా వేస్తుంద‌ని, దీనికి స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నామ‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఏకంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో మ‌ట్టి క‌రిపించి.. సైకిల్‌ను ప‌రుగులు పెట్టిస్తామ‌ని అన్న‌వారే!!

క‌ట్ చేస్తే.. ఆ వ్యాఖ్య‌ల సంగ‌తి అలా ఉంచండి.. ఇప్పుడు అస‌లు క‌డ‌ప‌లో ``టీడీపీ`` అనే మాటే వినిపించ‌డం లేదు. ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. పైన చెప్పుకొన్న వ్యాఖ్య‌లు చేసిన వారిలో స‌గంమంది ఏనాడో సైకిల్ దిగిపోయి.. త‌లోదిక్కూ వెళ్లిపోయారు. పులివెందుల‌లో పోటీ చేసి జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తాన‌ని.. చెప్పిన స‌తీష్ రెడ్డే.. త‌ర్వాత వైసీపీ పంచ‌కు చేరిపోయారు. ఇక‌, క‌డ‌ప‌లో టీడీపీ స‌త్తా చాటుతామ‌ని మీసాలు రువ్విన సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డిలు.. బీజేపీ చంక ఎక్కేశారు. దీంతో కీల‌క నాయ‌కులు లేక టీడీపీ బోసిపోయింది. పోనీ.. బీటె ర‌వి, రామ‌సుబ్బారెడ్డి వంటివారు ఉన్నారులే.. ఇక‌, పార్టీ పుంజుకుంటుంద‌ని .. కొన్నాళ్ల కింద‌ట చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

కానీ, చంద్ర‌బాబు అలా ప్ర‌క‌ట‌న చేశారో.. లేదో.. రామ‌సుబ్బారెడ్డి మ‌రుస‌టి రోజు సైకిల్ దిగి.. వైసీపీ గూటికి వెళ్లిపోయారు. ఇక‌, మిగిలిన యువ నాయ‌కుడు బీటెక్ ర‌వి. నిజానికి బీటెక్ ర‌వి దూకుడుగానే ఉన్నారు. ఆ మ‌ధ్య మూడు రాజ‌ధానుల అంశం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు, మండ‌లి నిర్ణ‌యాన్ని పాటించ‌నందు‌కు వ్య‌తిరేకంగా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి సంచ‌న‌ల‌నం సృష్టించారు. ఇక‌, అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు `హ‌మ్మ‌య్య‌` క‌డ‌ప‌పై ఆశ‌లు ఉన్నాయ‌ని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆశ‌లు అడుగంటాయి. ఎవ‌రైతే.. టీడీపీకి ఆశ‌ల సార‌ధిగా ఉన్నార‌ని చంద్ర‌బాబు భావించారో.. బీటెక్ ర‌వి అరెస్ట‌యి.. ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు.

2018 మార్చి 4న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్ట్ చేసిన పోలీసులు క‌ప‌డ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన తెలిసిందే. అయితే, ఈ విష‌యం టీడీపీలో ని ఇత‌ర నేత‌ల‌ను కూడా హ‌డ‌లెత్తించింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రిద్ద‌రు టీడీపీ త‌ర‌ఫున మాట్లాడేవారు. అయితే, బీటెక్ ర‌వి ఘ‌ట‌న త‌ర్వాత ఏ ఒక్క‌రూ ముందుకు రావ‌డం లేదు. చంద్ర‌బాబు పిలుపునిచ్చినా.. ఎవ‌రూ స్పందించ‌డం లేదు. టీడీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తే.. త‌మ‌పై ఉన్న పాత‌ కేసుల‌ను ఎక్క‌డ తిర‌గ‌దోడ‌తారోన‌ని భ‌యానికి గుర‌వుతున్నారు. దీంతో క‌డ‌ప‌లో టీడీపీ ఫుల్ సైలెంట్ అయిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.