Begin typing your search above and press return to search.

ఆ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు సూసైడ్

By:  Tupaki Desk   |   25 Aug 2020 6:03 AM GMT
ఆ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు సూసైడ్
X
కరోనా వస్తే? అదేం తప్పేం కాదు. ఎలాంటి పొరపాటు చేయకున్నా.. ఎవరో చేసిన దానికి ఫలితం అనుభవించాల్సిన చిత్రమైన పరిస్థితి. మనమెంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటోడు సరిగా లేకుంటే చాలు.. కరోనా బారిన పడేందుకు నూటికి నూరు శాతం అవకాశం ఉంటుంది. అయితే.. ఈ రోగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. తాజాగా అలాంటి పరిస్థితే ఒక రాజకీయ నేతకు.. నలుగురికి ధైర్యం చెప్పాల్సిన పెద్ద మనిషి చేసుకోవటం షాకింగ్ గా మారింది.

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శిరిగిరెడ్డి గంగిరెడ్డి తాజాగా సూసైడ్ చేసుకున్నారు. ఇటీవల ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ గా మారటంతో ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఒక్కడే ఒంటరిగా ఆసుపత్రి బయటకు వచ్చాడు అక్కడ సిబ్బంది అలా ఎందుకు బయటకు వచ్చారని చెబితే.. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు.

అలా బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవటాన్ని సిబ్బంది గుర్తించారు. సందేహం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి.. ఆయన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. ఆయన ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ పరిణామం ఎదురైంది. రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకున్న వైనం వారికి కనిపించింది. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కరోనా ప్రాణాలు తీసుకునేంత భయంకరమైన జబ్బు కాదు. నలుగురికి మంచి చెడులు చెప్పి.. ధైర్యంగా ఉండాల్సిన నేత.. ఇలా ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది.