Begin typing your search above and press return to search.

మళ్ళీ కాపు ఉద్యమమా ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 5:08 AM GMT
మళ్ళీ కాపు ఉద్యమమా ?
X
తొందరలోనే కాపులను బీసీల్లో చేర్చే ఉద్యమం చేయాలని కాపు ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) ప్రకటించింది. చంద్రబాబునాయుడు హయాంలో కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ తో ఓ ఉద్యమం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ డిమాండ్ కు ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించారు. అయితే ఎన్నిరోజులు ఉద్యమం చేసినా ఉపయోగం ఉండదన్న విషయాన్ని కాపునేతలు గ్రహించారు. ఎందుకంటే చంద్రబాబు ఇఛ్చింది తప్పుడు హామీ అన్న విషయం లేటుగా అర్ధమైంది. అందుకనే కాపులకు రిజర్వేషన్ డిమాండ్ ను కాపులు వదిలేశారు.

అలాంటి సంక్లిష్టమైన రిజర్వేషన్ అంశాన్ని మళ్ళీ మొదలుపెట్టాలని కాపు ఐకాస తాజాగా నిర్ణయించింది. కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ను జగన్మోహన్ రెడ్డి ముందుంచినపుడు సాధ్యం కాదని తేల్చేశారు. ఎందుకంటే రిజర్వేషన్లన్నది కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశమని జగన్ స్పష్టంగా చెప్పేశారు. మరిప్పుడు మళ్ళీ ఐకాస ఎందుకు ఇదే డిమాండ్ మొదలుపెడుతుంది ? ఎందుకంటే ఏ కులాన్నైనా బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర పరిధిలోని నిర్ణయం తీసుకోవచ్చు అని కేంద్రం రాజ్యాంగ సవరణ కూడా చేసిందట.

కేంద్రం ఎలాగూ రాష్ట్రాలకే అధికారాలను ఇచ్చింది కాబట్టి వెంటనే కాపులను బీసీల్లో చేర్చాలని ఐకాస డిమాండ్లు మొదలుపెట్టింది. నిజానికి ఏ కులాన్నైనా బీసీల్లో చేర్చటం అంత సులువు కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతానికి మించాలంటే అందుకు ముందుగా శాస్త్రీయపద్దతిలో జనగణన జరగాలి. ఏ కులం జనాభా ఎంతో తేలిన తర్వాత ఆ నివేదికను కేంద్రం ముందుంచాలి. ఆ తర్వాత ప్రక్రియను పూర్తి చేసి పార్లమెంటులో బిల్లు పాసవ్వాలి.

ఏ కులాన్నైనా బీసీల్లో చేర్చేయటమన్నది అంత సులువు కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత మాత్రాన ఏ కులాన్నీ బీసీల్లో చేర్చలేదు అన్న విషయం ఐకాస నేతలు గ్రహించాలి. కాకపోతే కాపు కార్పొరేషన్ కు నిధులు ఎక్కువ మంజూరు చేయించుకోవటం, వివిధ పోస్టుల్లో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయటం వరకు ఓకే. అంతేకానీ ఆచరణ సాధ్యం కాని డిమాండ్లను పెట్టి జగన్ పై ఒత్తిడి తేవాలని అనుకుంటే సాధ్యమయ్యే పనికాదు.

కాపులకు రిజర్వేషన్ కల్పించాలని జగన్ అనుకున్నా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అందుకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డువస్తుంది. తమిళనాడులో బీసీలకు అత్యధిక రిజర్వేషన్ ఉంది. ఎలాగంటే అక్కడ ప్రత్యేకంగా కులగణన జరిగింది. జనాభాలో అత్యధికులు బీసీలే అని శాస్త్రీయంగా ఓ కమిటి ద్వారా ప్రభుత్వం నిర్ధారణ చేసింది. దాంతో ఇదే నివేదికను కేంద్రానికి పంపి తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టించుకుని ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వును ఇప్పించుకున్నది. ఏపిలో కూడా అదంతా జరిగితే కానీ కాపులకు రిజర్వేషన్లు సాధ్యంకాదని కాపు నేతలు గ్రహించాలి.