Begin typing your search above and press return to search.

ఏపీలో జగన్.. కేంద్రంలో మోదీ: కేఏ పాల్

By:  Tupaki Desk   |   13 April 2019 4:51 PM GMT
ఏపీలో జగన్.. కేంద్రంలో మోదీ: కేఏ పాల్
X
ఏపీ పాలిటిక్సులో జబర్దస్త్ రోల్ ప్లే చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలింగ్ పూర్తయి 48 గంటలైనా కూడా తన స్పీడు ఏమాత్రం తగ్గించలేదు. పాల్ తమ్ముడూ అని సంబోధించే పవన్ కల్యాణ్ పోలింగ్ రోజు సాయంత్రమే పాత రేడియో పెట్టుకుని పాటలు వింటూ నీరసపడిపోయినా పాల్ మాత్రం ఇంకా పంచ్‌ లు విసురుతూ హుషారుగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన వైస్ షర్మిళ చేసిన ఓ వ్యాఖ్య తన గురించేనంటూ చెప్పుకొంటున్నారు. అలాగే... ఏపీలో వైసీపీ - కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తాయన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

సింహం సింగిల్‌గా వస్తుందని - వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తన గురించే చెప్పారని పాల్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ - టీడీపీ సహకారంతో గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తన ప్రచారానికి ఆకర్షితులైన యూత్ - 60 శాతం ఓట్లను తమ పార్టీకి వేశారన్నారు. తన వల్ల లబ్ధి పొందిన నేతలే తనకు మద్దతు ఇవ్వలేదని కేఏ పాల్ తెలిపారు. జగన్ మీడియా తప్ప తననెవరూ జోక్‌ గా తీసుకోవడం లేదని - 2014లో తాను మద్దతిచ్చిన నేతలంతా స్వీప్ చేశారని వెల్లడించారు.

కేంద్రంలో మళ్లీ మోదీయే అధికారంలోకి వస్తే దేశంలో ఆర్ ఎస్ ఎస్ రాజ్యమేలుతుందని - ఏపీలో జగన్ వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తన నోరు మూయించేందుకు భారతరత్న - నోబెల్ పురస్కారానికి తన పేరును మోదీ సిఫారసు చేశారని తెలిపారు.

మొత్తానికి పాల్ మాటలు చూస్తుంటే ఏపీలో జగన్ - కేంద్రంలో మోదీ వస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది.