Begin typing your search above and press return to search.

కేఏ పాల్.. నామినేషన్ హుళక్కేనా?

By:  Tupaki Desk   |   25 March 2019 8:57 AM GMT
కేఏ పాల్.. నామినేషన్ హుళక్కేనా?
X
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ఎంత సీరియస్ గా ఏపీ పాలిటిక్స్ లోకి వచ్చాడో అంతే సీరియస్ గా నవ్వుల పాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన నర్సాపురం బరిలో హేమాహేమీలకు పోటీ ఇద్దామని దిగాడు. జనసేన అభ్యర్థి నాగబాబు సహా టీడీపీ - వైసీపీలకు చెక్ పెడతానని బీరాలు పలికాడు. కానీ ఇక్కడ రాజకీయ ఆటలో ఇప్పుడు అరటిపండుగా మారిపోయాడని అర్థమవుతోంది.

తాజాగా కేఏ పాల్ నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రజా శాంతి పార్టీ తరుఫున నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్ లో కేఏ పాల్ వివరాలేవీ ప్రకటించలేదు. కేవలం పేరు - అడ్రస్ - పాన్ కార్డ్ నంబర్ మాత్రమే ఇచ్చేశాడట.. పేరును కిలారి ఆనంద్ గా చెప్పిన పాల్.. ఫోన్ నంబర్ - ఈమెయిల్ ఐడీని మాత్రమే ఇచ్చారు. నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులు - అప్పులు - అఫిడవిట్ పత్రాలను పాల్ సమర్పించలేదు. తన చేతిలో 30వేల రూపాయలు నగదు మాత్రమే ఉన్నట్టు చెప్పాడు. ఆస్తుల్ని ప్రకటించలేదు. ఇన్ కం టాక్స్ కట్టలేదట.. కేసుల వివరాల్ని వెల్లడించలేదు.

దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఈ వివరాలు కావాలని పాల్ కు ఫోన్ చేసి కోరారట.. కానీ ఆయన అఫిడవిట్ సమర్పించలేదు. నామినేషన్లకు సోమవారమే ఆఖరి గడువు. ఆ తర్వాత పరిశీలన.. తిరస్కరణ ఈ నేపథ్యంలో కేఏపాల్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ లెక్కన నర్సాపురం బరిలో దిగుతానని ప్రకటించిన కేఏపాల్ ఈ రాజకీయ ఆటలో అరటిపండుగా మారాడని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. కేఏపాల్ నామినేషన్ తిరస్కరణ ఖాయమని.. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే పాల్ ఇదంతా చేస్తున్నాడని.. ఎన్నికలు అయిపోగానే అన్నీ సర్దుకొని వెళ్లిపోతాడని ఎద్దేవా చేస్తున్నారు. గెలవడం చేతకాక పాల్ తన వివరాలను సమర్పించలేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పాల్ పనితనం ఎంతనేది రెండు మూడు రోజుల్లోనే తేలబోతోంది.