Begin typing your search above and press return to search.

ట్రంప్‌ను ఓడించేందుకు దేశాధినేతల్ని కలుస్తున్నా: కేఏ పాల్

By:  Tupaki Desk   |   12 Aug 2020 12:34 PM GMT
ట్రంప్‌ను ఓడించేందుకు దేశాధినేతల్ని కలుస్తున్నా: కేఏ పాల్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు తాను అమెరికాకు వచ్చానని చెబుతూ కేఏ పాల్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను ఎంతోమంది అధ్యక్షులను కలిశానని, ప్రపంచ నాయకులను కలిశానని, వారంతా కూడా ట్రంప్‌ను ఓడించేందుకు తన వెంట ఉన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లోని 99 శాతం మంది క్రిస్టియన్స్ కూడా ట్రంప్‌ను ఓడించాలని కోరుకుంటున్నారని, దాదాపు వంద శాతం మంది ముస్లీంలు అదే ఆలోచనతో ఉన్నారని, 90 శాతం మంది యూరోపియన్స్ కూడా ట్రంప్ ఓడిపోవాలని కోరుకుంటున్నారన్నారు.

కెనడా, మెక్సికో, జర్మన్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా అన్ని దేశాలు కూడా ట్రంప్ ఓడిపోవాలని కోరుకుంటున్నాయన్నారు. 99 శాతం మంది మెక్సికన్లు కూడా ట్రంప్ ఓటమినే కోరుకుంటున్నారన్నారు. కేవలం రేసిస్ట్‌లు మాత్రమే ట్రంప్ గెలుపును కోరుకుంటున్నారన్నారు. అతను కచ్చితంగా ఓడిపోవాల్సి ఉందన్నారు. ఇరాన్, చైనా, రష్యా, కొరియాలపై మొదటి దఫా ట్రంప్ యుద్ధానికి సిద్ధం కాలేదని, అందుకు ఎన్నికలే కారణమని, కానీ ఈసారి గెలిస్తే మాత్రం కచ్చితంగా మూడో ప్రపంచయుద్ధం ఖాయమన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల అధినేతలు ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధంగా లేరని, ఎందుకంటే ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడు కావడమే అన్నారు.

కానీ ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 99శాతం మంది నాయకులు ట్రంప్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని, నేను రాజకీయాలు మాట్లాడుతుంటే అందరికీ ఆశ్చర్యం వేయవచ్చునని, కానీ ఏసు కూడా రాజకీయాలు మాట్లాడారని చెప్పారు. ట్రంప్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. 300 కోట్ల క్రిస్టియన్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇండియాకు వచ్చిన ట్రంప్ అక్కడ జరిగిన దాడులను ఖండించలేదన్నారు. ఆయన తన కోసం, తన కుటుంబం కోసమే పని చేస్తున్నారన్నారు. తాను చాలామంది దేశాధినేతలతో కలిసి ఫోటోలు దిగానని, కానీ వీటిని బయటపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. నేను మతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం, దేశాల రక్షణ కోసం పిలుపునిస్తున్నానని చెప్పారు. నన్ను దేవుడు నడిపిస్తున్నాడని కేఏ పాల్ చెప్పారు. 2002 నుండి ట్రంప్, నేను ఏడుసార్లు కలుసుకున్నామని, 2016లో తన మద్దతు కోసం మార్పు చెందినట్లు నటించాడన్నారు. నేను ఎప్పుడూ ఆధారాలు లేకుండా మాట్లాడానన్నారు.