Begin typing your search above and press return to search.

కేఏ పాల్‌ కు మిగతా నేతలకు తేడా అదే..

By:  Tupaki Desk   |   26 April 2019 10:07 AM GMT
కేఏ పాల్‌ కు మిగతా నేతలకు తేడా అదే..
X
హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో పోలింగ్ అనంతరం పార్టీల అధినేతలు కాస్త విశ్రాంతి తీసుకునే పనిలో పడ్డారు. కొన్ని నెలలుగా నిత్యం ప్రచార యాత్రలు - నాయకులతో వ్యూహరచనలు - సమావేశాలు - సభలతో బిజీబిజీగా గడిపిన నేతలు ఫలితాలు వచ్చేలోగా కొద్ది రోజులు సేదీతీరేందుకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు.

వైసీపీ అధినేత జగన్ ఐరోపా యాత్రలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు సిమ్లా వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల వేళ శారీరకంగా - మానసికంగా అలసిపోయిన నేతలు కుటుంబాలతో విహారానికి వెళ్లి రిఫ్రెష్ అవుతున్నారు.

అయితే.. ఏపీ ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరించి - అలుపెరగకుండా తిరిగిన మరో నేత మాత్రం వీరికి భిన్నంగా సాగుతున్నారు. రాజీకీయ పనులతో ఇంతవరకు బిజీగా గడిపిన ఆయన ఎన్నికలు పూర్తయిన కొద్దిరోజులకే మరో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనే... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల వరకు.. ఆ తరువాత కూడా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. ఫేస్‌ బుక్‌ లో లైవ్‌ లిస్తూ కనిపించిన పాల్ మూణ్నాలుగా రోజులుగా కనిపించడం లేదు. అయితే.. ఆయన మిగతా నాయకుల్లా సేదదీరడానికి విహారయాత్రలకు వెళ్లలేదు.

వరుస బాంబు దాడులతో అట్టుడికిపోయిన పొరుగు దేశం శ్రీలంకలో ప్రజలను ఓదార్చడానికి.. వారికి అవసరమైన సాయం చేయడానికి.. తనకున్న అంతర్జాతీయ సంబంధాలను వాడుతూ బాధితులకు వీలైనంత సహాయం చేయడానిక ఆయన శ్రీలక వెళ్లారు.

క్రైస్తవ మత బోధకుడైన పాల్.. శ్రీలంకలోని చర్చిల్లో బాంబులు పేలడంతో అక్కడ తన సేవలందించడానికి వెంటనే అక్కడికి పయనమయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్న పాల్.. అక్కడి నుంచి తెలంగాణలోని విద్యార్థుల సమస్యలపై స్పందించారు. తెలంగాణ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త విని చాలా ఆవేదనకు లోనయ్యానని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పారు. చావు దేనికీ పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా న్యాయం చేస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన న్యాయం చేయలేని పక్షంలో తాను విద్యార్థులకు అండగా నిలబడతానని - న్యాయం కోసం పోరాడదామని చెప్పారు.

ఏపీ రాజకీయాల్లో పాల్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారో కానీ... ఆయన శ్రీలంక విషయంలో స్పందించిన తీరు.. అక్కడున్నప్పటికీ ఇక్కడ తెలంగాణ విద్యార్థుల విషయంలో స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.