Begin typing your search above and press return to search.

కేఏ పాల్ లో ఈ కోణం చూశారా?

By:  Tupaki Desk   |   8 April 2019 10:08 AM IST
కేఏ పాల్ లో ఈ కోణం చూశారా?
X
కేఏ పాల్.. మంచి మత ప్రబోధకుడే కాదు.. మంచి రాజకీయ నాయకుడు అని కూడా తేలింది. తను పోటీచేస్తున్న నర్సాపురంలో ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజుపై నియోజకవర్గంలో దాడి జరగడం.. ఆయన కారు అద్దాలు ధ్వంసం కావడం సంచలనమైంది. వైసీపీ అభ్యర్థిపై దాడిని ప్రత్యర్థి, నర్సాపురంలో పోటీచేస్తున్న నాగబాబు ఖండించకపోగా.. దీనివెనుక వేరే పార్టీల వారు ఉన్నారని ఆడిపోసుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి కూడా దీనిపై స్పందించిన పాపాన పోలేదు..

కానీ ఇదే నర్సాపురం నుంచి ప్రజాశాంతి పార్టీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్ మాత్రం తన గొప్ప మనసు చాటుకున్నాడు. రఘురామకృష్ణం రాజుపై దాడిని ఖండించారు. రాజకీయాల్లో ఎంత శత్రుత్వం ఉన్నా ఇలా దాడులు చేసుకోవద్దని పార్టీలకు హితవు పలికారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు ఫ్రస్టేషన్ లో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయం పట్టుకోవడం వల్లే ఇలా దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. సంప్రదింపులు, చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని.. భౌతిక దాడులు సత్సంప్రదాయాలు కాదని స్పష్టం చేశారు.

ఇలా రాష్ట్రంలోనే తీవ్ర పోటీ ఉన్న నర్సాపురంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు కత్తులు దూసుకుంటుండగా.. ఇదే పార్లమెంట్ కు పోటీచేస్తున్న పాల్ మాత్రం వైసీపీ అభ్యర్థిపై దాడిని ఖండించి ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఖండించడం విశేషంగా చెప్పవచ్చు. రాజకీయాల్లో కామెడీనే కాదు.. కాసింత మానవత్వాన్ని పండించవచ్చని కేఏపాల్ తాజాగా ఈ ఘటనతో నిరూపించారు.