Begin typing your search above and press return to search.

గులాబీ ముల్లు గుచ్చుతాందే : ప్లీనరీ వేళ వివాదాల పాల్ !

By:  Tupaki Desk   |   26 April 2022 2:36 PM GMT
గులాబీ ముల్లు గుచ్చుతాందే : ప్లీనరీ వేళ వివాదాల పాల్ !
X
అత్యంత ఉత్సాహంతో అత్యంత వైభ‌వంతో అత్యంత వేడుక‌గా జరుపుకునే గులాబీ పార్టీ జెండా పండుగ రానే వ‌చ్చింది. రేపే పొరుగున తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావం. ఆ  సంద‌ర్భంగా ఆ పార్టీ అతి చేస్తుంద‌ని మండిప‌డుతూ ప్ర‌పంచ శాంతి దూత కోపోద్రిక్తం అయిన వేళ.. చాలా విష‌యాలు వాస్త‌వాల రూపంలో వెల్ల‌డికి నోచుకున్నాయి. నిబంధ‌న‌లకు విరుద్ధంగా పాల‌క ప‌క్షాలు ప్ర‌వ‌ర్తించ‌డంపై కేఏ పాల్ మండిప‌డ్డారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

రేపు తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ దినోత్స‌వం. ఇందుకు హైటెక్స్ సిద్ధం అవుతోంది. ముందుగా పాస్ లు జారీ చేసిన వారికి మాత్రమే స‌భా ప్రాంగ‌ణంలో అనుమ‌తి ఉంటుంది అని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇదే సందర్భాన మ‌రో వివాదం గుచ్చుతోంది ఆ పార్టీని.! ప్లీన‌రీ సంద‌ర్భంగా హైద్రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి గొప్ప‌త‌నాన్ని చాటుతూ గులాబీ దండు ధూం ధాంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇవి చూసి నిబంధ‌న‌లకు విరుద్ధంగా ఉన్నాయ‌ని, వీటిని వెంట‌నే చించేయాల‌ని వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌జా శాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు కేఏ పాల్ పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు మంత్రి కేటీఆర్ పైనా ఇత‌ర టీఆర్ఎస్ శ్రేణుల‌పైనా ఫిర్యాదు చేసేందుకు ఇవాళ ఆయ‌న జీహెచ్ఎంసీ క‌మిన‌ర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేర‌కు సంబంధిత ఉన్న‌తాధికారి కార్యాల‌యానికి కూడా వ‌చ్చారు. కానీ క‌మిష‌న‌ర్ అక్క‌డ లేక‌పోవ‌డంతో కేఏ పాల్ ఆగ్రహావేశాలు వ్య‌క్తం చేస్తూ చాలా విష‌యాలు మాట్లాడారు. తెలంగాణ‌లో పెట్టుబడుల‌కు ముఖ్యంగా హైద్రాబాద్ లో పెట్టుబ‌డుల‌కు తానెంతో కృషి చేశాన‌ని అన్నారు. మిగులు బ‌డ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులమ‌యం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

గ‌తంలో ఫ్లెక్సీలు ఎవ్వ‌రూ ఏర్పాటు చేసేందుకు వీల్లేద‌ని కేటీఆర్ చెప్పిన వీడియో క్లిప్పింగ్ ఒక‌టి చూపించారు. మ‌రి! ఆ రోజు ఆవిధంగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడెలా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని, న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ప్లీన‌రీ సంద‌ర్భంగా అంద‌మ‌యిన  కేసీఆర్, అంద‌మ‌యిన క‌విత, అంద‌మ‌యిన రామారావు ఫొటోలే క‌నిపిస్తున్నాయ‌ని, ఇదెంత మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని, మ‌నం డెమొక్ర‌సీలో ఉన్నామా ?  డిక్టేట‌ర్ షిప్ లో ఉన్నామా ?  అన్న‌ది అర్థం కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

గ‌తంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కార‌ణంగా జీహెచ్ఎంసీ మేయ‌ర్ కే మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల అప‌రాధ రుసుం విధించార‌ని, ఆ సంగ‌తి మ‌రిచిపోకూడ‌దని అన్నారు. ఒక్కొక్క‌రికీ ఒక్కో విధంగా రూల్స్ ఉంటాయా ? అని ప్ర‌శ్నిస్తూ, తాను దీనిపై న్యాయ స్థానంకు వెళ్లేందుకు స‌మ‌యం లేద‌ని, అందుకే రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌ర‌యినా కారు పార్టీ ఫ్లెక్సీలు చింపేయాల‌ని పిలుపునిస్తూ కొత్త వివాదానికి తెర‌లేపారు.