Begin typing your search above and press return to search.

కేఏ పాల్ ఇంట విషాదం..ఊహించని బాధ‌లో నేత‌

By:  Tupaki Desk   |   11 Feb 2019 2:39 PM GMT
కేఏ పాల్ ఇంట విషాదం..ఊహించని బాధ‌లో నేత‌
X
ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు - క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ - ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. అనారోగ్యంతో విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె… రాత్రి 8.30 గంటల సమయంలో మరణించారని కేఏ పాల్ స్వయంగా ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లి మర‌ణ వార్త గురించి పాల్ తెలియ‌జేస్తూ ప్రభువుతో ఆమె కలిసిపోయిందని.. జనవరిలో ఆమెతో మాట్లాడడం జరిగిందని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సొంత ఇల్లు - కారు - ఒక్క రూపాయి లేకపోయినా.. నిత్యం పేదల బాగు కోసం ఆమె ప్రార్థించే వారని గుర్తు చేసుకున్నారు. ఆమె కన్నుమూయడంతో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతోందని కె.ఏ.పాల్ సందేశంలో స్పష్టం చేశారు. ఆమె అంత్యక్రియలు పాల్ ఆడిటోరియంలో ఇవాళ (సోమవారం - ఫిబ్రవరి 11) సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ప్రజాశాంతి తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని.. తన తల్లి సంతోషమ్మ సూచించినట్లు చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవ‌ల పాల్ త‌న త‌ల్లి గురించి తెలిపారు. త‌న భార్య‌తో అనివా మేరీ కిలారితో క‌లిసి మీడియా ముందు మాట్లాడిన పాల్ చాలా దైవ‌భ‌క్తి ఉన్న త‌న‌తో స‌హా త‌న భార్య చేసిన ప్రార్థ‌నల ఫ‌లితంగా త‌న త‌ల్లి బ్ర‌తికింద‌ని వివ‌రించారు. ఆస్ప‌త్రిలో డ‌యాల‌సిస్ పొందుతున్న త‌న త‌ల్లి బ్ర‌తికే అవ‌కాశం లేద‌ని తాను భావించాన‌ని - స‌మాధి కూడా సిద్ధం చేశామ‌ని అయితే కేవ‌లం ప్రార్థ‌న‌ల వ‌ల్ల ఆమె బ్ర‌తికింద‌ని పాల్ వెల్ల‌డించారు. అయితే, పాల్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన వారం త‌ర్వాత ఆయ‌న త‌ల్లి క‌న్నుమూశారు.