Begin typing your search above and press return to search.

పాల్ సాబ్ మ‌ళ్లీ ఏసేశారుగా..!

By:  Tupaki Desk   |   3 March 2019 9:36 AM GMT
పాల్ సాబ్ మ‌ళ్లీ ఏసేశారుగా..!
X
తెలుగు ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేని పేర్ల‌లో కేఏ పాల్ ఒక‌రు. ఆయ‌నేం మాట్లాడ‌తారో ఆయ‌న కంటే కూడా.. ఆయ‌న మాట‌లు వినే వారికి బాగా అర్థ‌మ‌వుతుంద‌న్న మాట ప్ర‌చారంలో ఉంది. ఎలాంటి విష‌యాన్ని అయినా స‌రే.. న‌మ్మ‌కంగా చెప్ప‌ట‌మే కాదు.. ఆయ‌న చుట్టూ ఉండే వారు సైతం ఆయ‌న మాట‌ల్ని చాలా భ‌య‌భ‌క్తుల‌తో అంగీక‌రించే వైనం చూసిన‌ప్పుడు మాత్రం షాకింగ్ గా ఉంటుంది.

డొనాల్డ్ ట్రంప్.. హిల్ల‌రీ క్లింట‌న్ లాంటోళ్లు పాల్ సాబ్ కు.. సందు చివ‌ర ఛాయ్ దుకాణంతో స‌మానం. ఆయ‌న ఎప్పుడు ఎక్క‌డ ఉంటారో.. ఏం చేస్తారో అస్స‌లు అర్థం కాదు. ఆయ‌న‌కున్నంత అంత‌ర్జాతీయ స‌ర్కిల్ తెలుగు నేల మీద పుట్టిన ఏ ఒక్క రాజ‌కీయ నేత‌కు లేద‌న్న మాట కొంద‌రి నోటి వెంట అదోలా వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా ఆయ‌న ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌నే మాయ‌.. అత‌ని బ‌తుకే మాయ అంటూ పాట పాడేశారు. పాల్ లాంటి వ్య‌క్తి ఏ ప‌నినైనా అల‌వోక‌గా చేసే ర‌కం కాబ‌ట్టి.. ఆయ‌నేం చేసిన చూస్తూ ఉండాలే కానీ.. దాని లోతుల్లోకి అస్స‌లు వెళ్ల‌కూడ‌దు. మీడియా మైకులు త‌న ముందుకు రాగానే.. ఆయ‌న నోటి నుంచి అద్భుతం లాంటి మాట‌లు వ‌స్తూ ఉంటాయి.

క‌ల‌లో కూడా ఊహించ‌లేని విష‌యాలు చాలానే చోటు చేసుకుంటున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. అవ‌న్నీ ఎప్పుడో కాదు.. నిన్న‌.. మొన్న‌నే జ‌రిగిన‌ట్లుగా చెప్పేస్తుంటారు. అలాంటి విష‌యాన్నే ఒక‌టి చెప్పిన పాల్.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని శుక్ర‌వారం రాత్రి జ‌గ‌న్ క‌లిశార‌న్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి 48 శాతం ఓట్లు.. టీడీపీకి 15 శాతం.. వైఎస్సార్ కాంగ్రెస్ కు 15 శాతం ఓట్లు.. ఇత‌రుల‌కు 5 శాతం వ‌స్తుంద‌ని తాజాగా చేయించిన స‌ర్వేలో తేలింద‌న్నారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని.. అందుకే రాహుల్ గాంధీ నుంచి పిలుపు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను వారి వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇంత ధీమాగా ఉన్న కేఏ పాల్ ను ఏపీ ప్ర‌జ‌లు మ‌రెంత‌లా కాలం భ‌రించాల్సి ఉంటుందో..?