Begin typing your search above and press return to search.

అమ‌ర‌వీరుల కేంద్రంగా పాల్ పొలిటిక‌ల్ ర‌చ్చ‌.. తెలంగాణ‌లో హాట్ టాపిక్‌

By:  Tupaki Desk   |   12 Jun 2022 11:30 PM GMT
అమ‌ర‌వీరుల కేంద్రంగా పాల్ పొలిటిక‌ల్ ర‌చ్చ‌.. తెలంగాణ‌లో హాట్ టాపిక్‌
X
ప్ర‌జా శాంతి వ్య‌వ‌స్థాప‌కుడు, పొలిటిక‌ల్ ఫ‌న్నీ నేత కేఏ పాల్ ఏం చేసినా.. రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీస్తోంది. ఇటీవ‌ల కాలంలో తెలంగాణపై ఫోక‌స్ పెంచిన పాల్‌.. ఇక్క‌డ కేసీఆర్‌ను గ‌ద్దె దించేస్తాన‌ని.. తాను ప్ర‌ధాని అవుతాన‌ని.. త‌న‌తో చేతులు క‌లిపితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఏపీకి ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని.. వ్యాఖ్య‌లు చేసి.. రాజకీయ హాస్యానికి వేదిక‌గా మారిన విష‌యం తెలిసిందే. అయితే.. తెలంగాణ‌లో ఆయ‌న తాజాగా సెంటిమెంటు రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్రాణ త్యాగం చేసిన అమ‌ర వీరుల కేంద్రంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు.

అయితే.. ఈ విధానం పాల్ రాజ‌కీయాల‌ను వివాదంలోకి నెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి తెలంగాణ‌లో ఇప్ప‌టికీ.. సెంటిమెంటు పోలేదు. అమ‌ర‌వీరుల స్ఫూపాల‌కు నాయ‌కులు అంజ‌లి ఘ‌టించ‌డం.. వారి ఆశ‌లు క‌ల‌ల‌ను సాకారం చేస్తామ‌ని చెప్ప‌డం.. తెలిసిందే. ఇక‌, అస‌లు తెలంగాణ ఏర్పాటుకు అమ‌ర‌వీరుల బ‌లిదానాలే రెడ్ కార్పెట్ వేశాయ‌నేది అంద‌రూ అంగీక‌రించే విష‌యం. ``అంత మంది చేసిన ప్రాణ‌త్యాగం సోనియాను క‌దిలించింది`` అని కాంగ్రెస్ నేత‌లు.. రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలో గొప్ప‌గా చెప్పుకొచ్చారు.

తెలంగాణ మలి దశ ఉద్యమం ఊపందుకోవడానికి కేసీఆర్ ఆమరణదీక్షతో పాటు ఎల్బీనగర్ సర్కిల్‌లో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోవడం కూడా ఓ కారణం. తెలంగాణ ఉద్యమమంలో ఆయనది ఓ ప్రత్యేకమైన పాత్ర. అందుకే శ్రీకాంతాచారి తల్లిదండ్రులకు గుర్తింపు ఉంది. త‌ర్వాత కాలంలో శ్రీకాంతాచారి కుటుంబాన్ని విస్మ‌రించార‌నే వాద‌న ఉంది. అయితే.. చారి తల్లి శంకరమ్మ హు జూర్‌నగర్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీఆర్ఎస్ గెలిచేటప్పుడు ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ శ్రీకాంతాచారి తండ్రి కేఏ పాల్ పార్టీలో చేరిపోయారు.

మ‌రోవైపు.. ప్ర‌జాశాంతి పార్టీ తరపున తొలి టిక్కెట్ ఆయనకే ఇస్తాన‌ని పాల్ గొప్ప‌గా ప్ర‌క‌టించారు. అయితే.. ఇదే రాజ‌కీయ వివాదానికి దారితీసింది. దీనిపై శ్రీకాంతాచారి తల్లి మండి పడుతున్నారు. ``మా ఆయనకు మందు పెట్టి కేఏపాల్ తీసుకెళ్లారు`` అని ఆమె ఆరోపించారు. పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాల్ ఇంటిని జ‌ల్లెడ ప‌ట్టారు. ఇంట్లో సోదాలు చేప‌ట్టారు. ఆయ‌న‌ను గృహ నిర్బంధం చేశారు. దీంతో ఇది కాస్తా.. రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. ఇక‌, ఈ విష‌యంలో శ్రీకాంతాచారి తండ్రి యూట‌ర్న్ తీసుకోవ‌డం కొస‌మెరుపు.

ప్ర‌స్తుతం శ్రీకాంతాచారి తండ్రి పాల్‌తోనే ఉంటున్నారు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. శంకరమ్మ కేసు పెట్టడంతో పోలీసులు పాల్ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. శ్రీకాంతాచారి తండ్రి పాల్ ఇంట్లోనే ఉన్న‌ట్టు గుర్తించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పోలీసుల‌తో మాట్లాడుతూ.. ``తాను.. పాల్ దగ్గరే ఉంటా``నని తేల్చిచెప్పారు. అంతేకాదు.. పాల్ త‌న‌కు టికెట్ ఇస్తార‌ని..పోటీచేస్తాన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పాల్ వ్య‌వ‌హారం తెలంగాణ‌లో మ‌రో దుమారానికి దారితీసింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ క‌థ ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.